Tirupati By-Election: రసవత్తరంగా తిరుపతి ఉప ఎన్నిక.. ఉద్ధండులను దింపిన వైసీపీ, టీడీపీ.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ?

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక..

Tirupati By-Election: రసవత్తరంగా తిరుపతి ఉప ఎన్నిక.. ఉద్ధండులను దింపిన వైసీపీ, టీడీపీ.. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ?
Tirupati By Election
Follow us

|

Updated on: Mar 24, 2021 | 2:55 PM

Tirupati By-Election becoming interesting: గత ఆరు నెలల నుంచి ఎదురు చూసిన తిరుపతి లోక్‌సభ సీటు ఉప ఎన్నిక రానే వచ్చింది. గత వారం షెడ్యూలును ప్రకటించగా.. బుధవారం (మార్చి 24) నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు తమ అభ్యర్థులను ప్రకటించేశారు. వీరిలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. బుధవారం నామినేషన్ కూాడా వేశారు. అయితే.. బరిలో వున్నా ఏ మేరకు ప్రభావం చూపుతుందో తెలియని బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపికపై ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. అభ్యర్థి సంగతి అటుంచితే.. ఏపీలో ఇపుడు బీజేపీకి అన్నీ ప్రతికూల పరిస్థితులే నెలకొనడంతో కమలనాథులు బెంబేలెత్తిపోతున్నట్లు సమాచారం. చివరికి మిత్రపక్షంగా భావించిన జనసేన కూడా తిరుపతి ఉప ఎన్నికలో సహకరిస్తుందా లేదా అన్న అనుమానాన్ని కమలం శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని తిరుపతి లోక్ సభ బరిలోకి దింపింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు అసెంబ్లీ ఎన్నికలతోపాటు తెలుగు రాష్ట్రాలలో రెండు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఏపీలో తిరుపతి లోక్‌సభ సీటుతోపాటు తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ సెగ్మెంటుకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా సోకి మరణించడంతో తిరుపతికి, సిట్టింగ్ ఎమ్మెల్య నోముల నర్సింహయ్య మరణంతో నాగార్జునసాగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. రెండు చోట్ల అధికార పార్టీకి చెందిన సభ్యులే మరణించడంతో.. ఆ సీట్లను కోల్పోవద్దన్న కృత నిశ్చయంతో అధికార పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

తిరుపతి లోక్‌సభ నుంచి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి టిక్కెట్ దక్కవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి గురుమూర్తి పేరు తెరమీదికి వచ్చింది. అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం డా.గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మినే రంగంలోకి దింపాలని నిర్ణయించింది. జనసేనతో కలిసి పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ తామే బరిలో నిలుస్తామని ప్రకటించింది. కాని అభ్యర్థి ఎంపిక దగ్గరే బీజేపీ ఆగిపోయినట్లు కనిపిస్తోంది. దానికి తోడు ఓ విశాఖ స్టీలు ప్లాంటు ఉద్యమం, మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం స్థానిక బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారిన పరిస్థితి గోచరమవుతోంది. ఈ క్రమంలో తిరుపతి ఎన్నికల్లో ఎంతటి బలమైన అభ్యర్థిని నిలిపినా.. ఫలితం లేదని పలువురు కమలనాథులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

తాజాగా ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన ప్రకారం తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 23న జారీ చేసింది. మర్నాడు అంటే బుధవారం మార్చి 24న నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. మార్చి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ మూడో తేదీ దాకా ఉపసంహరణలకు అవకాశం వుంటుంది. ఏప్రిల్ 17వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మే రెండో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాన్ని వెల్లడిస్తారు. కాగా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి సర్వేపల్లి, గూడూరు (ఎస్సీ రిజర్వుడు), సూళ్ళూరుపేట (ఎస్సీ), వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు (ఎస్సీ) అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కాగా.. తిరుపతి లోక్‌సభ సీటు చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. 1952లో ఈ ఎంపీ సీటుకు తొలిసారి ఎన్నికలు జరిగాయి. తొలి రెండు సార్లు అంటే 1952, 1957 ఎన్నికల్లో తిరుపతి నుంచి మాఢభూషి అనంతశయనం అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపునే సీ.దాస్ ఎంపీగా తిరుపతి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రెండు సార్లు 1971, 1977లలో కాంగ్రెస్ పార్టీ తరపున టీ. బాలకృష్ణయ్య, 1980లో పసల పెంచలయ్య (కాంగ్రెస్) తిరుపతి నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1984లో తిరుపతి ఎంపీ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కింది. చింతామోహన్ టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు.

ఇదే చింతా మోహన్ 1989, 1991లలో కాంగ్రెస్ పార్టీ తరపున తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1996 మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నెలవల సుబ్రహ్మణ్యం ఎంపీగా గెలిచారు. 1998లో తిరిగి టీడీపీలో చేరిన చింతామోహన్ తిరుపతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరుపతి సీటు బీజేపీకి దక్కింది. టీడీపీతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ తరపున తిరుపతి ఎంపీగా నందిపాకు వెంకటస్వామి గెలుపొందారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ తిరుపతి ఎంపీగా గెలుపొందారు. 2014లో వెలగపల్లి వరప్రసాద రావు, 2019లో బల్లి దుర్గాప్రసాద్ రావు వైసీపీ తరపున గెలుపొందారు. మొత్తమ్మీద తిరుపతి నుంచి అత్యధిక సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన ఘనత చింతా మోహన్‌కు దక్కింది. ఆయన మొత్తమ్మీద ఆరు సార్లు (రెండు సార్లు టీడీపీ తరపున, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ తరపున) తిరుపతి ఎంపీగా విజయం సాధించారు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాదరావు 47.84 శాతంతో 5 లక్షల 80 వేల 376 ఓట్లు సాధించారు. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. కారుమంచి జయరామ్ బీజేపీ తరపున పోటీ చేసి 44.76 శాతంతో మొత్తం 5 లక్షల 42 వేల 951 ఓట్లు సాధించారు. రాష్ట్ర విభజన కారణంగా దారుణంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ తరపున చింతా మోహన్ పోటీ చేసి కేవలం 33 వేల 333 ఓట్లు సాధించగలిగారు. కొత్తపల్లి సుబ్రహ్మణ్యం (సిపిఎం) 0.92 శాతంతో 11 వేల 168 ఓట్లు సాధించారు. నోటాకు 2.94 శాతంతో 35 వేల 420 ఓట్లు పడ్డాయి.

2019లో జరిగిన సాధారణ ఎన్నికలల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున బల్లి దుర్గా ప్రసాద్ రావు పోటీ చేసి విజయం సాధించారు. దుర్గా ప్రసాద్ రావు 55.03 శాతంతో ఏడు లక్షల 22 వేల 877 ఓట్లు సాధించారు. ఆయన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన పనబాక లక్ష్మపై 2 లక్షల 28 వేల 376 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పనబాక లక్ష్మకి 37.65 శాతంతో 4 లక్షల 94 వేల 501 ఓట్లు పడ్డాయి. నోటాకు 1.96 శాతంతో 25 వేల 781 ఓట్లు రాగా.. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చింతా మోహన్‌కు 1.84 శాతంతో 24 వేల 39 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి శ్రీహరి రావుకు 1.60 శాతంతో 20 వేల 971 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బి. శ్రీహరి రావుకు 1.22 శాతంతో 16 వేల 125 ఓట్లు పడ్డాయి.

ఇదిలా వుంటే.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి బుధవారం నెల్లూరులో నామినేషన్‌ దాఖలు చేశారు. గత నాలుగు రోజులుగా ఆమె టీడీపీ కీలక నేతలతో కలిసి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో మంగళవారం ప్రత్యేక సమావేశం జరిగింది. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత గురువారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు పనబాక లక్ష్మి. మరోవైపు అధికార వైసీపీ బుధవారం తిరుపతిలో కీలక సమావేశం నిర్వహించింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కూడా హాజరై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి ప్రచార వ్యూహంపై చర్చించారు.

ఇంకోవైపు బీజేపీ ముఖ్య నేతలందరు తిరుపతిలోనే మకాం పెట్టారు. స్థానికాంశాలు కాకుండా జాతీయ అంశాలు, నరేంద్ర మోదీ చరిష్మాల ఆధారంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని బీజేపీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉండగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి తిరుపతికి మంగళవారం చేరుకుని నేతలతో కలిసి ఎన్నికపై వ్యూహరచన చేశారు. నియోజకవర్గ నేతలతో భేటీ కావడంతో పాటు జనసేనతో సమన్వయం గురించి చర్చించారు. అభ్యర్థి ఎంపిక ఆలస్యంపై నేతల్లో అసంతృప్తిని ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించేలా ఒత్తిడి తీసుకురావాలని సంకల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగిన సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చింతా మోహన్‌ ప్రచారం కూడ ప్రారంభించారు. అధికార వైసీపీ లక్ష్యంగా ఆయన విమర్శలు మొదలు పెట్టారు.

బీజేపీ అభ్యర్థి రత్నప్రభ?

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారిణి కె.రత్నప్రభ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రత్నప్రభ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కాగా ఆమె 1981 బ్యాచ్‌ కర్నాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి. కన్నడ ప్రభుత్వంలో ఆమె పలు హోదాలలో పని చేశారు. 2018 జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. 2019లోనే ఆమె బీజేపీలో చేరారు. ఆమె భర్త ఎ.విద్యాసాగర్‌ ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి. రత్నప్రభ కూడా కొన్నాళ్లు డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వంపై బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఏ క్షణమైన రత్నప్రభ అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.

ALSO READ: సరిహద్దులో కొత్త కుట్రకు డ్రాగన్ తెర.. భూమ్మీది నుంచి సముద్ర జలాల దాకా చైనా కుట్రలే కుట్రలు