Tamilnadu Elections and Political Parties Manifestoes: తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలిస్తున్న హామీలు, విడుదల చేస్తున్న మ్యానిఫెస్టోలతో ఎన్నికల ప్రచారం పసందుగా మారుతోంది. అంతులేని హామీల వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మొదట్నించి ఎన్నికల హామీలు ఇవ్వడంలో తమిళ రాజకీయ పార్టీలది భిన్నమైన స్టైల్. ఉచిత హామీల పథకాలతో దేశంలోనే ఓ ప్రత్యేక పేరు సంపాదించింది తమిళనాడు రాష్ట్రం. అదే ధోరణి కంటిన్యూ చేస్తూ.. తాజా అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నాయి. ప్రధాన పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే తమ తమ మ్యానిఫెస్టోల్లో గుప్పించిన హామీలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో వరాల జల్లు కురిపించాయి. ఆల్ ఫ్రీ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలు రచించాయి. ఉచిత పథకాల వాగ్దానాలే అధికారానికి మెట్లుగా భావిస్తున్నాయి తమిళ పార్టీలు.
అన్నాడీఎంకే హామీలు…
దాదాపు 163 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు అన్నా డిఎంకే అధినేత, ముఖ్యమంత్రి పళనిస్వామి. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవటమే లక్ష్యంగా హామీలిచ్చారు. రేషన్ కార్డు హోల్డర్లందరికీ అమ్మ వాషింగ్ మెషీన్లు, ఇళ్లు లేనివారికి అమ్మ ఇల్లమ్ హౌసింగ్ స్కీములో తక్కువ ధరకే పక్కా గృహాలు, ఇంటి వద్దకే రేషన్ సరుకులు, గృహిణుల బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.1,500 జమ, ఇంటింటా సౌరశక్తి గ్యాస్ స్టౌవ్‌లు, ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలెండర్లు, మహిళలకు బస్సు ప్రయాణ ఛార్జీల్లో 50 శాతం రాయితీ, ఉచిత కేబుల్ టీవీ కనెక్షన్, అమ్మ విహార కానుక పెంపు, నవ దంపతులకు సారె, రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ సేవలతో అమ్మ క్లినిక్‌లు, ప్రసూతి సెలవుల్లో పెంపుదల, విద్యార్ధులకు 2 జీబీ ఉచిత మొబైల్ డేటా, విద్యా రుణాల మాఫీ, ఇంటికో ఒక ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇనిస్టిట్యూట్స్, వృద్ధ్యాప్య పెన్షన్ ఒక వేయి రూపాయల నుంచి రెండు వేలకు పెంపు, ఆటో రిక్షాలు కొనాలనుకునేవారికి 25 వేలు సబ్సిడీతో ఎంజీఆర్ గ్రీన్ ఆటోలు, జర్నలిస్టులకు ఉచిత గృహాలు, ఫించను, చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలు, రైతులకు ఏటా 7,500 సబ్సిడీ, దివ్యాంగులకు ఆర్ధిక సాయం 1500 రూపాయల నుంచి 2500కు పెంపు, ఉపాధి హామీ పథకం 100 నుంచీ 150 రోజులకు పెంపు, పసుపు, ఉల్లి, వరి, అరటి రైతులకు కనీస మద్దతు ధర వర్తింపు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు వంటి వాగ్దానాలు అన్నా డిఎంకే మ్యానిఫెస్టోలో ఉన్నాయి.
వీటితో పాటు అన్నా డిఎంకే మరికొన్ని హామీలను తమ మ్యానిఫెస్టోలో ప్రస్తావించింది. మద్రాస్ హైకోర్టు పేరును తమిళనాడు హైకోర్టుగా మార్చడం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవడం, శ్రీలంకలోని తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించడం, వ్యవసాయ కమీషన్ ఏర్పాటు చేయడం, రాజీవ్ హంతకుల విడుదల వంటివి కూడా అన్నా డిఎంకే మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించారు.
డీఎంకే హామీలు…
కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న ప్రతిపక్ష డిఎంకే పార్టీ తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా ఏకంగా 500 పైగా హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసింది. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలలో 3.5 లక్షల ఉద్యోగాల భర్తీ, కొత్తగా 2 లక్షల ఉద్యోగాల సృష్టి, పెట్రోల్ ధరలు రూ.5 తగ్గింపు, డీజిల్ ధరలు రూ.4 తగ్గింపు, వంట గ్యాసు సిలెండర్లపై రూ.100 సబ్సిడీ, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ నాప్‌కిన్లు, మహిళలు సహకార బ్యాంకుల్లో 5 సవర్ల వరకు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల మాఫీ, మహిళలకు ప్రసూతి సెలవు 12 నెలల వరకు పొడిగింపు, ప్రసూతి ఆర్ధిక సాయం 24 వేల రూపాయలకు పెంచడం, మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం, అవిన్ పాల ధర రూ.3 తగ్గింపు, ఆస్తి పన్ను పెంచేది లేదు, బియ్యం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు కరోనా సాయం 4 వేల రూపాయల చెల్లింపు, రేషన్ షాపుల్లో చౌక ధరకు మినప్పప్పు, అదనంగా 1 కేజీ చక్కెర పంపిణీ, రోడ్లపైనే నివసించే వారి కోసం నైట్ షెల్టర్ల నిర్మాణం, హిందూ ఆలయాల పరిరక్షణకు రూ.1000 కోట్ల కేటాయింపు, చర్చిలు, మసీదుల నిర్వహణకు రూ.200 కోట్ల కేటాయింపు, రైతులకు మోటార్లు కొనుక్కునేందుకు రూ.10,000 ఆర్థిక సాయం, వరి మద్దతు ధర 2500 రూపాయలకు పెంచడం, జల్లికట్టు ఎద్దులను పెంచేవారికి నెలకు వేయి రూపాయల ఆర్ధిక సాయం, ప్రభుత్వ పాఠాశాలల విద్యార్థులకు ఉచిత డాటాతో ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ పంపిణీ, 30 ఏళ్ల లోపు విద్యార్దుల విద్యారుణాల మాఫీ, పాఠశాల విద్యార్ధులకు ప్రతిరోజూ ఉదయం ఉచిత పాలు పంపిణీ, అమ్మ క్యాంటిన్ తరహాలో 500 కలైంజ్ఞర్ ఫుడ్ స్టాల్స్, ప్రఖ్యాత హిందూ ఆలయాల పర్యటనకు వెళ్లేందుకు లక్ష మందికి ఒక్కొక్కరికి 25 వేల రూపాయల వంతున ఆర్థిక సాయం, ప్రభుత్వ విభాగాల్లో 10 ఏళ్లకు పైబడి తాత్కాలిక విధుల్లో ఉన్న వారందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు, పౌష్టికాహారం, అంగన్‌వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఫించను రూ.1,500కు పెంపు, 32 లక్షల మంది నిరాదరణకు గురైన మహిళలు, 50ఏళ్లు దాటిన పెళ్లి కాని మహిళలు, దివ్యాంగులు, రైతు రక్షణ పథకం లబ్ధిదారులు, శ్రీలంక శరణార్థులకు 1,500 రూపాయల పింఛన్ పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల రిజర్వేషన్లు 30 నుంచి 40 శాతానికి పెంపు, ప్రైవేటు రంగంలోను రిజర్వేషన్లు అమలు, నిరుద్యోగ పట్టభద్రులు చిన్న పరిశ్రమలు పెట్టుకునేందుకు 20 లక్షల రూపాయల వరకు రుణాలు, ఆటో డ్రైవర్లకు ఆటోలు కొనేందుకు 10 వేల రూపాయల సబ్సిడీ, సముద్ర తీర జాలర్లకు 2 లక్షల ఇళ్ళ నిర్మాణం వంటివి డిఎంకే మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలు.
వీటితో పాటు బడిలో 8వ తరగతి వరకు నిర్భంధ తమిళం భాష నేర్పడం, జాతీయ గ్రంధంగా “తిరుక్కురుళ్”ని ప్రకటించేలా ఒత్తిడి తేవడం, మెరుగైన నీటి పారుదల వ్యవస్థ, బకింగ్‌హామ్ కాలువకు మరమ్మతులు, సురక్షిత మంచినీటి సరఫరా, ప్రజల వినతులపై అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పరిష్కారం, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే నీట్ రద్దుకు ఆర్డినెన్స్, జయలలిత మృతిపై విచారణ వేగవంతం చేయడం, అన్నాడీఎంకే మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేయడం, ఈలం తమిళులకు పౌరసత్వం కల్పించడం, సేలం గ్రీన్ వే పనుల నిలుపుదల, అదానీ హార్బర్ నిర్మాణం నిలుపుదల, సీఏఏకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం వంటి అంశాలు కూడా డీఎంకే మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలు. కాగా.. తమిళనాడుపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో హిందువుల ఓట్లకు గండి పడకుండా వుండేందుకు హిందూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వారికి ఆర్థిక సాయం వంటి అంశాలను డిఎంకే మ్యానిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించింది.
ALSO READ: భారత దేశం మెరిసిపోతోంది.. ఏకంగా రష్యానే వెనక్కి నెట్టేసి నాలుగో స్థానానికి ఇండియా!
ALSO READ: తెలంగాణలో చాపకింద నీరులా కరోనా విస్తృతి.. వారం రోజులుగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ALSO READ: ఏపీలో తిరుగులేని వైసీపీ.. మరింతగా పడిపోయిన విపక్షాల బలం.. టీడీపీ ఓట్ల శాతంలో భారీ తరుగుదల