తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: కేవలం ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి సీఎం పళనిస్వామి పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీల్లో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు: కేవలం ఆరుగురితో అన్నాడీఎంకే తొలి జాబితా.. ఎడప్పాడి నుంచి సీఎం పళనిస్వామి పోటీ
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 05, 2021 | 9:54 PM

AIADMK releases first list : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయపార్టీల్లో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార ఏఐఏడీఎంకే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. అయితే ఈ జాబితాలో కేవలం ఆరుగురు మాత్రమే చోటు దక్కింది. ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, మత్స్యశాఖ మంత్రి డి.జయకుమార్, న్యాయశాఖ మంత్రి వే షణ్ముగం, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎస్పీ షణ్ముగనాథన్, ఎస్. థెన్ మొళిలకు తొలి జాబితాలో స్థానం లభించింది. తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలు ఉండగా, మిగతా అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలి జాబితాను ప్రకటించింది అన్నాడీఎంకే.. సిట్టింగ్‌ స్థానాల నుంచే బరి లోకి దిగేందుకు కసరత్తులు మొదలు పెట్టింది. ఒకవైపు అన్నాడీఎంకే – బీజేపీల మధ్య పొత్తు కుదరడంతో సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఈ సమయం లోనే తొలిజాబితాను అన్నాడీఎంకే విడుదల చేసింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి బరి లోకి దిగుతున్నారు సీఎం పళనిస్వామి. బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం.

ఇక, పీఎంకేతో అన్నాడీఎంకేకు ఇప్పటికే పొత్తు కుదిరింది. పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. బీజేపీతో పొత్తుపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. తమిళనాడు నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారన్న వార్తలు ఇప్పుడు ద్రవిడనాట కాకరేపుతున్నాయి. కన్యాకుమారి లోక్‌సభ స్థానం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక దిగుతారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రియాంకాగాంధీకి కన్యాకుమారి టిక్కెట్‌ కేటాయించాలని తమిళనాడు కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి దరఖాస్తు ఇచ్చారు కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం.

మరోవైపు పుదుచ్చేరి రాజకీయాలు జోరందుకున్నాయి. ఎన్నికల వేళ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఎవరు ఎటువైపు ఉంటారో అర్థం కాని పరిస్థితి. సీఎం అభ్యర్థిని నేనంటే నేనంటూ వారిలో వారే కొట్లాడుకుంటున్నారు. బీజేపీ, ఎన్‌ఆర్‌కాంగ్రెస్‌, ఏఐఏడీఎంకేలు కలిసి ఏర్పాటుచేసిన ఎన్‌డీఏ కూటమిలో తాజాగా లుకలుకలు బయటపడ్డాయి. ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన నమశివాయను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే యోచనలో ఉంది బీజేపీ.

అయితే, తానే సీఎం అభ్యర్థినంటూ పట్టుబడుతున్నారు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ రంగస్వామి. కూటమిలో ఉంటూనే తమ నేతలపై కాషాయ కండువా కప్పుతున్నారని ఫైరవుతున్నారు. బీజేపీతో సీట్ల సర్దుబాటు చర్చలకు కూడా గైర్హాజరయ్యారాయన. ఐతే సందట్లో సడేమియాలా తమతో పొత్తుకు కలిసిరావాలని రంగస్వామికి గాలం వేస్తోంది డీఎంకే. తమ పార్టీ తరపున మీరే సీఎం అభ్యర్థి అంటూ..భారీ ఆఫర్‌ కూడా ప్రకటించేసింది.

మరోవైపు తమిళనాడులో డీఎంకే- కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్ధుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయి. సీపీఐకి మాత్రం ఆరుసీట్లు కేటాయించింది డీఎంకే.

ఇదీ చదవండిః  Telangana Governor : ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన తెలంగాణ గవర్నర్‌.. అత్యున్నత సేవలకు దక్కిన గుర్తింపుగా ప్రదానం..