Tamil Nadu Elections: ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది తమిళనాట రాజకీయాలు మరింత జోరందుకున్నాయి. దివంగత నాయకురాలు జయలలిత స్టైల్‌లో ప్రచార పర్వంలో దూసుకుపోతున్న డీఎంకే నేత స్టాలిన్.. తాజాగా జయలలిత మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా ఆమె తమ శత్రువు అయినప్పటికీ.. ధీర వనిత అంటూ ప్రశంసలు గుప్పించారు. ఇప్పుడీ కామెంట్స్ తమిళనాట హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నాడు స్టాలిన్ కన్యాకుమారిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. జయలలితకు తమకు సిద్ధాంతాల పరంగా అనేక విభేధాలు ఉన్నప్పటికీ ఆమెను తమిళనాడుు ముఖ్యమంత్రిగా గౌరవిస్తామని అన్నారు.
ఆమె తమకు శత్రువు అయినప్పటికీ.. తమకు కూడా ముఖ్యమంత్రి అనే చూస్తామని పేర్కొన్నారు. అయితే, జయలలిత మరణం విషయంలో తమకు అనేక అనుమానాలు ఉన్నాయని స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. తమకు మాత్రమే కాదని, తమిళనాడు ప్రజలందరికీ అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. తాము అధికారంలోకి రాగానే జయలలిత మరణంపై సమగ్ర విచారణ చేపడతామని స్టాలిన్ ప్రకటించారు. తమ పార్టీ మేనిఫెస్టోలో సైతం ఈ విచారణ అంశాన్ని ప్రకటించామని ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీని సైతం ధైర్యంగా ఎదుర్కొన్న ధీర వనిత జయలలిత అంటూ స్టాలిన్ తన ఎన్నికల ప్రచారంలో కీర్తించారు. కేంద్రం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సైతం ఆమె వ్యతిరేకించారని గుర్తు చేశారు. నీట్, సీఐఐకి వ్యతిరేకంగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడారని స్టాలిన్ పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు అన్నాడీఎంకే ఉన్న నేతలు మాత్రం ఆమె ఆశయాలను, లక్ష్యాలను నీరుగారుస్తున్నారని స్టాలిన్ ధ్వజమెత్తారు. అమ్మా, అమ్మా అంటూ ఆమె కాళ్లు మొక్కిన నేతలు ఇప్పుడు ఆమె ఆశయాలను బీజేపీకి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికలో బీజేపీతో అంటకాగుతున్న అన్నాడీఎంకేని చిత్తుగా ఓడించాలని, డీఎంకేని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.
Also read:
TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం