Tamil Nadu Assembly Polls: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి, నటి ఖుష్బు సుందర్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపిస్తూ ఖుష్బూపై అదనపు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకెళితే.. బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నటి ఖుష్బు సుందర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆమె థౌజండ్ లైట్స్ నియోజకవర్గం వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆ నియోజకవర్గంలోని ఓ మసీదు వద్ద ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, ఆమె స్థానిక అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మసీదు ముందు ఎన్నికల ప్రచారం నిర్వహించడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖుష్బు సుందర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదనపు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి కోడంబక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే మసీదు ముందు ప్రసంగించారని, కరపత్రాలను పంపిణీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్య ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని సదరు అధికారి ఫిర్యాదులో స్పష్టం చేశారు. అదనపు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు మేరకు కోడంబక్కం పోలీసులు ఖుష్బు సుందర్‌పై కేసు నమోదు చేశారు.
Also read: