Punjab Elections: ప్రతి మహిళకు నెలకు రూ.1,000 ఇస్తాం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. పంజాబ్‌లో ఆప్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రంలోని ప్రతి మహిళ బ్యాంకు ఖాతాలలో రూ.1,000 జమ చేస్తుందని ప్రకటించారు. “సమాజంలో సుస్థిరతను నిర్ధారించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తరుఫున ఆర్థిక సహాయం చేయడానికి ఆప్ హామీ ఇస్తుందన్నారు. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలందరికీ నెలకు 1000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది” అని కేజ్రీవాల్ మోగాలో చెప్పారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఆప్ అధినేత రెండు రోజుల పర్యటనలో ఉన్నారు.
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు భారీ ప్రకటనతో మోగా నుండి ‘మిషన్ పంజాబ్’ని ప్రారంభించనున్నారు. మోగా నుంచి కేజ్రీవాల్ ఓ సమావేశంలో పాల్గొనేందుకు లూథియానాకు వెళ్లారు. మంగళవారం, కేజ్రీవాల్ పార్టీ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అమృత్‌సర్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. ఇదిలావుంటే, 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో, కాంగ్రెస్ 77 సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో సంపూర్ణ మెజారిటీని సాధించింది. 10 సంవత్సరాల తర్వాత SAD-BJP ప్రభుత్వాన్ని గద్దె దించింది. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభలో ఆమ్ ఆద్మీ పార్టీ 20 స్థానాలను గెలుచుకుని రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) 15 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది, బీజేపీ 3 సీట్లకే పరిమితమైంది. కాగా, మిషన్ పంజాబ్’ కింద, కేజ్రీవాల్ వచ్చే నెలలో పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు.
Read Also… PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు గమనిక..! ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఈ పని చాలా సులభం..