AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress Party: గట్టెక్కే దారేది దేవుడా.. కనుమరుగవుతోన్న కాంగ్రెస్‌.. నాయకత్వ లేమితో ప్రాభవం కోల్పోతోన్న జాతీయ పార్టీ..

మరణించిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు దింపుడు కళ్లెం అని ఒక ఆచారాన్ని పాటిస్తారు. ప్రాణం పోయిందని తెలుసు. కాసేపట్లో కట్టె కాలిపోతుందని తెలుసు. అయినా అంతిమ సంస్కారానికి ముందు ఓ చివరి ప్రయత్నం.

Congress Party: గట్టెక్కే దారేది దేవుడా.. కనుమరుగవుతోన్న కాంగ్రెస్‌.. నాయకత్వ లేమితో ప్రాభవం కోల్పోతోన్న జాతీయ పార్టీ..
Congress Party
Basha Shek
|

Updated on: Mar 11, 2022 | 1:37 PM

Share

మరణించిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు దింపుడు కళ్లెం ఆశలు అని ఒక ఆచారాన్ని పాటిస్తారు. ప్రాణం పోయిందని తెలుసు. కాసేపట్లో కట్టె కాలిపోతుందని తెలుసు. అయినా అంతిమ సంస్కారానికి ముందు ఓ చివరి ప్రయత్నం. ఆయుష్షు ఉంటే మళ్లీ లేచి కూర్చుంటాడని. కానీ 125 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌కి ఆ ఆశకూడా లేదిప్పుడు. గుండెనో, కిడ్నీనో, లివరో ఏదో ఒకటి తేడా ఉంటే అవయవ మార్పిడికైనా ప్రయత్నించొచ్చు. కానీ శరీరమంతా చచ్చుబడిపోయాక ఇక చేసేదేముంటుంది? చేయడానికి ఏముంటుంది? కుడి ఎడంగా కాంగ్రెస్‌ పరిస్థితి అలాగే ఉంది. ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఘోరపరాజయం. ఘోరాతి ఘోరమైన అవమానం. బాగా పట్టున్న పంజాబ్‌ చేజారిపోయింది. పోయిన సారి ఎక్కువ సీట్లొచ్చినా  సమయం కలిసిరాక అధికారం చేజారిన గోవాలో పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఉత్తరాఖండ్‌ ఆశలు హిమాలయాల్లో కొండెక్కేశాయి. ఏకంగా ప్రియాంకా గాంధీ రంగంలో దిగడంతో యూపీలో ఏదో అద్భుతం జరుగుతుందనుకుంటే ఉన్న పరువు కాస్తా గంగలో కలిసిపోయింది. ముఖ్యంగా పంజాబ్‌లో ఆప్‌ కాంగ్రెస్‌కు మేకై కూర్చుంది. చీపురు దాటికి పార్టీ హస్తవ్యస్తమైపోయింది. మరోవైపు యువరాజావారేమో దేశసంచారం చేస్తున్నారు. పార్టీ పరువు నిలబెట్టేందుకు గాంధీల వారసురాలు రంగంలోకి దిగినా తేడా ఏమీ కనిపించడం లేదు . రిజల్ట్‌ సేమ్‌ టూ సేమ్‌. రేప్పొద్దున తెలుగురాష్ట్రాలైనా, గుజరాత్‌ అయినా ఏదో జరుగుతుందన్న ఆశ ఎవరికీ లేదు.

కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌  నిజమయ్యేలా.. 2014 నుంచి కాంగ్రెస్‌ ఘోర పరాజయాల్ని మూటగట్టుకుంటూనే వస్తోంది. చూస్తుంటే ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ అని బీజేపీ గతంలో ఇచ్చిన పిలుపు నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నవి రెండేరాష్ట్రాలు మాత్రమే. 2009లో యూపీఏ-1 పాలన ఫర్లేదనుకున్నా యూపీఏ-2 పాలన మళ్లీ గాడితప్పింది. నాయకత్వ లోపాలతో, స్వీయ తప్పిదాలతో 2014లో అధికారాన్ని బంగారుపళ్లెంలో పెట్టి మరీ బీజేపీకి అందించింది. పార్టీ చరిత్రలోనే తొలిసారి  కాంగ్రెస్‌ 44 సీట్లకు పడిపోయింది. పార్టీ ఓటు షేరు 19 శాతానికి దిగజారింది. అప్పట్నించీ ఓడిపోవడం తప్ప గెలుపనే మాట లేకుండా పోయింది కాంగ్రెస్‌ పార్టీకి.  ఇక 2019 ఎన్నికల్లో మరో 8 సీట్లు పెరిగాయే తప్ప పార్టీ కొంచెం కూడా బలపడింది లేదు. ఇక నాయకత్వ లోపంపై పార్టీలోని సీనియర్లు గొంతెత్తడం సరికొత్త సంక్షోభానికి దారి తీసింది. సోనియా అనారోగ్యం, రాహుల్‌ దాగుడుమూతలతో పార్టీ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడి నట్లయింది. ముఖ్యనేతలు పార్టీని వీడుతున్నా.. ఉన్నవారికి కాంగ్రెస్‌ అధిష్ఠానం భరోసా ఇవ్వలేకపోతోంది.

వెంటాడుతోన్న నాయకత్వ లోపం.. సోనియాకి ఆరోగ్యం సహకరించడం లేదు. రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని సీనియర్లు విశ్వసించడం లేదు. పార్టీ భారం భుజాలపై మోయడానికి యువరాజు కూడా సిద్ధంగా లేరనిపిస్తోంది. ఇక ప్రియాంక సమ్మోహనాస్త్రం అనుకుంటే యూపీలో ఆమె ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో కాంగ్రెస్‌ని ముందుకు నడిపే నాయకుడెవరన్నది జవాబులేని ప్రశ్నగానే ఉంది. మళ్లీ పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్‌ నేతలు తమను తాము ఓదార్చుకుంటున్నారు. కానీ అదెలాగన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఓపక్క దారుణ ఓటమితో కాంగ్రెస్‌ శ్రేణులు కుమిలిపోతుంటే.. వయనాడ్‌లో ఫలూదా రుచి చూస్తున్న రాహుల్‌గాంధీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభిమానులను వెక్కిరిస్తున్నట్లు ఉంది. ఇక కాంగ్రెస్ పూర్తిగా మునగడమా? తేలడమా? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్లే ప్రశ్నే.

ఎస్.ఇమాం షఫీ, టీవీ 9 తెలుగు

Also Read:Akhilesh Yadav: అయినా మేం ఓడిపోలేదు.. బీజేపీకి పోటీగా ఉన్నామని నిరూపించాం.. అఖిలేశ్ కీలక వ్యాఖ్యలు

Shane Warne: స్వదేశం చేరుకున్న షేన్‌ వార్న్‌ పార్థీవ దేహం.. లక్షమంది అభిమానుల సమక్షంలో ఆరోజునే అంత్యక్రియలు..

AP Crime: యువకుడిని చెట్టుకు కట్టేసి.. యువతిని లాక్కెళ్లి.. మద్యం మత్తులో ఏం చేశారంటే