Assam Election 2021: ప్రధాని నరేంద్ర మోదీ 24 గం.లూ అబద్ధాలే చెబుతారు…రాహుల్ గాంధీ విసుర్లు

Assam Assembly Election 2021: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ బుధవారం ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ముందుగా కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు.

Assam Election 2021: ప్రధాని నరేంద్ర మోదీ 24 గం.లూ అబద్ధాలే చెబుతారు...రాహుల్ గాంధీ విసుర్లు
Rahul Gandhi
Follow us

|

Updated on: Mar 31, 2021 | 3:06 PM

ఈశాన్య రాష్ట్రం అసోంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇద్దరూ ఒకే రోజు అసోంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే రాహుల్ గాంధీ అక్కడి కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం కొమ్రప్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలకోరంటూ రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. ‘నా పేరు నరేంద్ర మోదీ కాదు…ఇక్కడకు నేను అబద్ధాలు చెప్పేందుకు రాలేదు’ అంటూ ప్రధాని మోదీపై  ధ్వజమెత్తారు.  అసోం గురించి, రైతులకు సంబంధించి అబద్ధాలు వినాలంటే మీరు టీవీలను స్విశ్ఛాన్ చేయండి…ప్రధాని నరేంద్ర మోదీని చూస్తే ఆయన చాలా చెబుతారని వ్యాఖ్యానించారు. రోజులో 24 గంటలూ ఆయన దేశానికి అబద్ధాలే చెబుతారని ఆరోపించారు.

అస్సాం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా నెరవేర్చితీరుతుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు టీ గార్డెన్ కార్మికులకు రూ.365ల రోజువారీ కనీస కూలీ అందేలా చూస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీలాంటి పార్టీ కాదని…ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండే పార్టీ అని రాహుల్ చెప్పుకొచ్చారు.

అసోంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం… అటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా బుధవారంనాడు అసోంలోని చిరాంగ్‌లో పర్యటించారు. అసోం‌లో శాంతి నెలకొల్పేందుకు బోడో అగ్రీమెంట్‌లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. 2022కల్లా అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేస్తే…ముస్లీంల ఇళ్లకు కూడా తాగునీరు అందుతుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి కలను నెరవేరిస్తే…ముస్లీంల సొంతింటి కలకూడా నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. బోడోలు – నాన్ బోడోలు, అస్సామీలు-బెంగాళీలు, హిందువులు – ముస్లీంలు పరస్పరం కొట్టుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షగా ధ్వజమెత్తారు. అందరికి తోడుగా.. అందరి వికాసం కోసమే బీజేపీ అన్నది ప్రధాని మోదీ నినాదని వ్యాఖ్యానించారు.

ఈశాన్య రాష్ట్రం అసోంలోని 39 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ గురువారం జరగనుండగా…మూడో విడత (చివరి విడత) ఎన్నిక ఏప్రిల్ 6న జరగనుంది. మొత్తం 126 మంది సభ్యులతో కూడిన అసోం అసెంబ్లీలో మొదటి విడతలో 47 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రెండో విడతలో 39 స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహిస్తుండగా…చివరి విడతలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ప్రచార ఘట్టం మంగళవారం సాయంత్రంతో ముగియగా…ప్రస్తుతం చివరి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.