బైక్ సైలెన్సర్‌ తీసేసి ర్యాష్ డ్రైవింగ్‌తో యువకుడి రచ్చ.. సీఐతో పాటు పోలీసులపై దాడి

హైదరాబాద్ మహానగరంలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిదిలో రూల్స్ బ్రేక్ చేసినందుకు మందలించిన పోలీసులపై దాడికి తెగబడ్డాడు.

  • Balaraju Goud
  • Publish Date - 12:38 pm, Fri, 26 February 21
బైక్ సైలెన్సర్‌ తీసేసి ర్యాష్ డ్రైవింగ్‌తో యువకుడి రచ్చ.. సీఐతో పాటు పోలీసులపై దాడి

Young man attack on traffic police : హైదరాబాద్ మహానగరంలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిదిలో రూల్స్ బ్రేక్ చేసినందుకు మందలించిన పోలీసులపై దాడికి తెగబడ్డాడు. హద్దుమీరి ప్రవర్తించాడు. బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో నడుపుతున్న యువకుడిని ట్రాఫిక్ పోలీసులు నిలదీశారు. అంతే, ఆ యువకుడి ఆగ్రహంతో ఊగిపోయాడు. పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డాడు. హోంగార్డుపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో గాయపడ్డ హోంగార్డును తోటి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ దర్వేజ్ అనే యువకుడు రచ్చ చేశాడు. బైక్‌ సైలెన్సర్ తీసేసి హెవీ సౌండ్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. చెవికి చిల్లులు పడే శబ్దంతో వీరంగం సృష్టించాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సీఐ ఆ బైక్‌ను ఆపాల్సిందిగా హోంగార్డు రాథోడ్‌కు సూచించారు. ఆయన వాహనాన్ని నిలిపేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా హోంగార్డుపై దాడి చేశాడు.

హోంగార్డుపై దాడి చేస్తుండగా.. నిలదీసేందుకు సీఐ వెళ్లారు. ఆయన్ని కూడా ఈ యువకుడు నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. పోలీసు సిబ్బందితో పాటు ఇతర వాహనదారులు ఎంత చెప్పినా అతడు వినిపించుకోకుండా స్నేహితులతో కలిసి నానా హంగామా సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. యువకుడితో పాటు అతడి స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నాలుగు రోజుల క్రితం.. ఆంధ్ర, కర్నాటక బోర్డర్‌లో ఆంధ్ర కుర్రాడు సైతం ఇదే రేంజ్‌లో రెచ్చిపోయాడు. తన వాహనాన్ని ఆఫుతారా? ప్రిన్సిపల్ సెక్రటరీతో డైరెక్ట్‌గా మాట్లాడే రేంజ్‌ నాది. నన్ను ప్రశ్నిస్తారా అంటూ.. పోలీసులపై రుసరుసలాడాడు. తప్పు చేసింది కాకుండా తప్పించుకోవలనుకునే అతగాడిని పోలీసులు తమదైనశైలిలో మందలించారు.

కాగా, తరుచు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల పోలీసుల్లో ఆందోళన మొదలైంది. అయితే, తప్పు ఎవరు చేసిన ఉపేక్షించేంది లేదని తేల్చి చెబుతున్నారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకు పంపించడం ఖాయమంటున్నారు.

Read Also…  కోజికోడ్ రైల్వేస్టేషన్‌లో పేలుడు పదార్థాల కలకలం.. 100 జిలెటిన్ స్టిక్స్, 350 డిటోనేటర్లు స్వాధీనం