Crime News : బిహార్‌లో పెళ్లయిన 45 రోజులకే ఓ నవవధువు భర్త నుంచి విడాకులు కోరింది. విలేజ్ కోర్టులో హాజరై తన గోడు వెళ్లబోసుకుంది. తనకు తగిన పరిష్కారం చూపాలంటూ పెద్దలను వేడుకుంది. లేదంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ అందరి ముందు రోదించింది. ఇంతకు ఆమెకు వచ్చిన కష్టం ఏంటని అనుకుంటున్నారా.. అయితే చదవండి..
జహంగీరా గ్రామానికి చెందిన నేహా కుమారి అనే యువతి 12వ తరగతి వరకూ చదువుకుంది. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తిడితో సునీల్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లి జరిగిన 45 రోజుల తర్వాత భర్తను వదిలి ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఆమెపై పోలీసు కంప్లయింట్ నమోదైంది. దీంతో ఎట్టకేలకు విలేజ్ కోర్టు ముందు హాజరైంది. తన కథను కోర్టు పెద్దలకు తెలియజేసింది.
తనకు పెద్ద చదువులు చదవాలని ఉందని తల్లిదండ్రులుగానీ, అత్తమామలుగానీ తన మాటలు వినడం లేదని వాపోయింది. భర్త, అత్తమామలు తాను చదువుకోవడానికి ఒప్పుకోవడం లేదని అందుకే ఇంటి నుంచి పారిపోయానని అసలు విషయం తెలిపింది. దీంతో అందరు పెద్దలు ఆమె చెప్పిన కారణం విని షాకయ్యారు. చదువుపై ఆమెకున్న ఇష్టాన్ని చూసి ప్రశంసించాలా లేదా విడాకులు మంజూరు చేసి నవజంటను విడదీయాలా అనే సందిగ్ధంలో పడిపోయారు.
అయితే తనకు కచ్చితంగా విడాకులు కావాలని ఆ యువతి డిమాండ్ చేసింది.‘‘అత్తారింట్లో నాకు ఊపిరి సలపడం లేదని ఏడ్చేసింది. ఈ విషయంలో ఆమెకు, ఇరు కుటుంబాలకు నచ్చజెప్పేందుకు గ్రామ కోర్టు ప్రయత్నించింది. కుదరకపోవడంతో చివరకు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో సదరు యువతి విడాకులు తీసుకొని చదువుకోవడానికి రెడీ అయింది.