Andhra Pradesh Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. స్నానానికి వెళ్లి నేల బావిలో పడి ఇద్దరు గిరిజన విద్యార్థినులు జలసమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని భామిని మండలం కోటకొండ గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందన పి. కీర్తికి (12), ఎ.అంజలి (13) శుక్రవారం స్నానం చేసేందుకు గ్రామంలోని ఓ బావి దగ్గరకు వెళ్లారు. అనంతరం స్నానానికి దిగి బావిలో పడి మరణించారు. అనంతరం గమనించిన గ్రామస్థులు బావిలోనుంచి బాలికల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భామిని ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతిచెందిన బాలికలిద్దరూ స్నేహితులు. ఇద్దరు కూడా విజయనగరం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇద్దరూ గ్రామ శివార్లలోని నేల బావిలో స్నానానికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందినట్లు వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు బాలికలు మృతిచెందడంతో.. వారి తల్లి దండ్రులు శోకసంద్రంలో మునిగారు. కోటకొండలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read: