Selfie terror: సెల్ఫీ సరదాతో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కెమెరా మీద దృష్టి పెట్టి.. వెనుక ఏముందో చూసుకోక ప్రమాదాల్లో చిక్కుకుని మరణాల పాలవుతున్నారు. తాజాగా తమిళనాడులో ఓ యువకుడి సేల్ఫీ సరదా అతని ప్రాణాలు బలిగొంది. వివరాలు ఇలా వున్నాయి..తిరుపత్తూరు జిల్లాలోని వనియంబాడిలోని ఒక గ్రామంలో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇరవై ఏళ్ల యువకుడు ఒక బావిలో పడి మునిగిపోయాడని పోలీసులు తెలిపారు. వనియంబాడిలోని చిన్నమోత్తూరుకు చెందిన కె సంజీవ్ మధ్యాహ్నం తన ఇంటి దగ్గర ఉన్న వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అతను ఒక ట్రాక్టర్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకొని తన మొబైల్ ఫోన్‌లో స్నేహితులకు షేర్ చేశాడు. అది చూసిన అతని స్నేహితులు సేల్ఫీ చాలా బావుందని కామెంట్స్ పెట్టారు.
దీంతో సంజీవ్ మరికొన్నిసెల్పీలు తీసుకోవాలని ప్రయత్నం మొదలు పెట్టాడు. ట్రాక్టర్ మీద ఎక్కి, దానిని స్టార్ట్ చేసి సెల్ఫీ వీడియో తీసుకోవడానికి సిద్ధం అయ్యాడు. ఈ సమయంలో ట్రాక్టర్ వెనక్కి జరిగింది. అలా జరుగుతూ జరుగుతూ అక్కడ ఉన్న ఒక బావిలో పడిపోయింది. ఆ బావి 120 అడుగుల లోతు ఉంది. దానిలో నీరు 35 అడుగులు ఉంది. దూరం నుంచి ఈ సంఘటన చూసిన వ్యవసాయ కార్మికులు పోలీసులకు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ (టిఎన్ఎఫ్ఆర్ఎస్) కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వనియంబాడి,పోలీస్ ఆఫీసర్ ఎన్ వెంకటేశన్ నేతృత్వంలో ఎనిమిది మంది టిఎన్‌ఎఫ్‌ఆర్‌ఎస్ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు మోటార్ల సహాయంతో నీటిని తోడి.. ట్రాక్టర్ కు తాడు వేసి బయటకు తీశారు. “బాలుడి మృతదేహాన్ని తిరిగి పొందడానికి మేము నాలుగు గంటలు కష్టపడాల్సి వచ్చింది. మృతదేహాన్ని, ట్రాక్టర్‌ను బయటకు తీయడానికి బావిలోని నీటిని బయటకు పంప్ చేయాల్సి వచ్చింది ”అని వెంకటేశన్ తెలిపారు. మృతుడు సంజీవ్ క్యాటరింగ్‌లో ఒక కోర్సు పూర్తి చేసి, ఈ మధ్యనే చెన్నైలోని ఒక సంస్థలో ఉద్యోగంలో చేరినట్లు అతని బంధువులు చెప్పారు.
Also Read: పరాయి వ్యక్తితో ఉన్నప్పుడు చూశాడని.. మరొకరి ప్రైవేట్ పార్ట్‌ని కత్తిరించింది ఓ మహిళ