Selfie Death : సెల్ఫీ పిచ్చి వల్ల ఎంతమంది చనిపోతున్నా యువతలో మార్పు కనబడటం లేదు. సెల్‌ఫోన్ కెమెరా మీద దృష్టి పెట్టి.. వెనుక ఏముందో చూసుకోక ప్రమాదాల్లో చిక్కుకుని మరణిస్తున్నారు. సెల్‌ఫోన్ వ్యసనం, ఫొటోల పిచ్చి, పెరిగిన ఇంటర్నెట్ ప్రభావం వల్ల నేటి యువత తప్పుదోవ పడుతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో సెల్ఫీలు, ఫొటోలు అప్‌లోడ్ చేస్తూ సమయం వృథా చేయడమే కాకుండా అప్పుడప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఘోరమైన సంఘటన జరిగింది. పడవలో ఉన్న అమ్మాయిలు సెల్ఫీలు తీసుకుంటూ నదిలో పడి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భలుయాని పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాదేవ్ తాల్‌లో శుక్రవారం సాయంత్రం ఏడుగురు బాలికలు పడవ ప్రయాణానికి వెళ్లారు. అందరు ఉత్సాహంగా గడుపుతూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నారు. అందుకోసం పడవలో అందరు ఒకేవైపుకు రావడంతో బరువు పెరిగి పడవ అదుపుతప్పడంతో అందరు నీళ్లలో పడిపోయారు. కెమెరాలో కనిపించాలనే తాపత్రయంతో ఎక్కడ ఉన్నమనే విషయాన్ని మరిచిపోయారు.
ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు ఏదో ఒకవిధంగా తమను తాము రక్షించుకోగలిగారు. మిగతా ముగ్గురు మునిగిపోయారు. ప్రాణాలతో బయటపడిన నలుగురు బాలికలలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురైంది. చికిత్స కోసం గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు. పడవ నడిపే వ్యక్తి కూడా ఈత కొట్టుకుంటూ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలకు స్థానిక ప్రభుత్వం పరిహారం అందిస్తామని ప్రకటించింది.