Selfie video: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరు మక్కేవారిపేటలో గత నెల27వ తేదీన చోటు చేసుకున్న యువకుని ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. ఆ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కుమారుడు ఉద్యోగం రాక నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని తల్లిదండ్రులు భావించి అతని మృతదేహానికి వారి సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారు. అయితే కొద్దిరోజుల తర్వాత అతని ఫోన్ పరిశీలించగా తన కుమారుడు వేరే యువతితో కలిసి ఉన్న ఫోటోలు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలు, సూసైడ్ నోట్ బయట పడ్డాయి.
తన చావుకు మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్లో ఆర్ఎస్ఐగా పనిచేస్తున్న ఎల్లయ్య అలియాస్ రమేష్, గోలి నిరోషా, సుజాత అనే వారే కారణమని మృతుడు సంజయ్ తన ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనకు ముఖ్యమంత్రి ఎస్కార్ట్‌లో ఉద్యోగం చేయాలనదే తన జీవిత ఆశయమని, కష్టపడి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను పోషించాలని ఉందని ఈ వీడియోలో తెలిపాడు.
కాగా సంజయ్ ఫోన్లో ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్, అలాగే ఆడియో రికార్డింగ్‌ను మృతుడి తండ్రి కోటేశ్వరరావు గమనించాడు. తన కుమారుడు సంజయ్ ఆత్మహత్యకు వారే కారణమని గ్రహించాడు. శుక్రవారం రాత్రి కోటేశ్వరావు తన బంధువుల సహాయంతో రూరల్ ఎస్ఐ విజయ భాస్కర్ రెడ్డిని కలిసి ఆధారాలను చూపి తన కుమారుని ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా మృతుని తండ్రి కోటేశ్వరరావు ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా సంజయ్ ఆత్మహత్య సెల్ఫీ వీడియో సూసైడ్ నోట్ ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.
టి నాగరాజు, టీవీ9 తెలుగు, రిపోర్టర్, గుంటూరు
Also Read: