RRR : రఘురామరాజు కేసులో అనూహ్య పరిణామాలు.. సుప్రీం ఆదేశాల మేరకు జ్యుడిషియ‌ల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు

|

May 18, 2021 | 11:34 AM

MP Raghurama krishna raju : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు అరెస్ట్.. విచారణకు సంబంధించి సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

RRR : రఘురామరాజు కేసులో అనూహ్య పరిణామాలు.. సుప్రీం ఆదేశాల మేరకు జ్యుడిషియ‌ల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు
Raghu Rama Krishna Raju
Follow us on

MP Raghurama krishna raju : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు అరెస్ట్.. విచారణకు సంబంధించి సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎంపీ వైద్య ప‌రీక్ష‌ల ప‌రివేక్ష‌ణ‌కు జ్యుడిషియ‌ల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు న్యాయాధికారి నియామ‌కం చేసిన తెలంగాణ హైకోర్ట్.. జ్యుడిషియ‌ల్ రిజిస్ట్రార్ నాగార్జున‌ను ఈ మేరకు నియ‌మించింది. ఇదిలా ఉండగా, సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ఆంధ్రప్రదేశ్ నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. భారీ బందోబస్తు మధ్య ఆయన్ను పోలీసులు సోమవారం రాత్రి ఏపీ నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు. దీంతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణంరాజుకు వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక, ఈ రోజు మంగళవారం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సైతం ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే.. మరో నాలుగు రోజులపాటు రఘురామకృష్ణరాజు ఆర్మీ ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది.

కాగా, ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన రఘురామకృష్ణం రాజు బెయిల్‌ పిటిషన్‌తోపాటు ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, ఆదినారాయణరావు, ఏపీ ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే, వీవీ గిరి వాదనలు వినిపించారు. బెయిల్‌ మంజూరుతోపాటు ప్రైవేట్‌ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు రఘురామకు అవకాశం కల్పించాలని రోహత్గీ కోర్టును కోరారు. ఎంపీని అరెస్ట్‌ చేసిన తీరును, ఆతర్వాత జరిగిన పరిణామాలను న్యాయస్థానానికి వివరించడంతో.. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Read also : Etela : ఈటల శాపనార్థాలు : ‘బిడ్డా గుర్తు పెట్టుకో.. నువ్వు ఎన్ని టాక్స్‌లు ఎగగొట్టినవో తెలవదు అనుకుంటున్నావా.?’