Miryalaguda Bus Accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మిర్యాలగూడ హైవేపై ఆగివున్న లారీని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. రాత్రి 2 గంటల సమయంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలవగా.. మరొకరు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి సంఖ్య 10 మంది దాకా ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఐదుగురిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. వారిని పోలీసులు అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు.
కాగా, మృతులను మల్లికార్జున్, నాగేశ్వరరావు, జయరావుగా గుర్తించారు. శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే లారీని ఢీకొట్టాడని తెలుస్తోంది. అంతకుముందు కూడా దాచేపల్లి దగ్గర ఓ ఆటోను ఢీకొట్టబోయి.. కొద్దిలో తప్పించాడని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. నిద్రమత్తుతో ఉన్న డ్రైవర్‌ను అప్రమత్తం చేసినప్పటికీ.. అతను వినిపించుకోలేదని తెలిపారు. తాజాగా రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం తుక్కుతుక్కైంది. డ్రైవర్‌కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also… Afghanistan Crisis: పంజ్‌షీర్‌లో తీవ్ర పోరాటం..50 మంది తాలిబన్ సైనికుల హతం..బందీలుగా 20 మంది!
Nirmala Sitharaman: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్