నాగదోషానికి యూట్యూబ్‌లో వీడియోలు చూసి.. కన్న బిడ్డనే కడతేర్చింది.. సూర్యాపేట కేసులో షాకింగ్ విషయాలు..
Suryapet Child Murder Case: వారంతా ఉన్నతంగా చదువుకున్న వారే.. అయినా అలా ఎందుకు చేస్తున్నారో.. ఎవరికీ.. అంతుచిక్కడం లేదు. పూజల పేరుతో కన్న బిడ్డలనే కర్కషంగా బలిస్తున్నారు. అంతటితో..
Suryapet Child Murder Case: వారంతా ఉన్నతంగా చదువుకున్న వారే.. అయినా అలా ఎందుకు చేస్తున్నారో.. ఎవరికీ.. అంతుచిక్కడం లేదు. పూజల పేరుతో కన్న బిడ్డలనే కర్కషంగా బలిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఏవేవో ప్రళయాలు వస్తాయంటూ వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యావంతులైన తల్లిదండ్రులు తమ ఇద్దరు కన్నబిడ్డలను నరబలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే.. రెండు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో గురువారం ఓ వివాహిత తన పసిబిడ్డను నరబలి ఇచ్చింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఈడీ చదువుకున్న ఆ మహిళ… ఎవరో ఏదో దోషం ఉందని చెప్తే గుడ్డిగా నమ్మేసి.. ఏవేవో పూజలు చేసి చివరకు కన్నబిడ్డనే హతమార్చడంపై పలువురు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
వివరాలు.. సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాడు తండాకు చెందిన భారతికి ఆరేళ్ల క్రితం మొదటి వివాహం జరిగింది. ఆ తర్వాత విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అనంతరం భారతి… కృష్ణ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఆరు నెలల క్రితం పాప పుట్టింది. అయితే భారతికి నాగ దోషం ఉందని ఓ వ్యక్తి చెప్పడంతో అప్పటినుంచి ఆమె మానసిక స్థితిలో మార్పు వచ్చింది.. వింత వింతగా చేయడం మొదలు పెట్టింది. దీంతో భారతి కోలుకోవాలంటూ.. ఆమె కుటుంబసభ్యులు పలు ఆలయాలు, చర్చిలు, దర్గాలకు తీసుకెళ్లారు. అయినా.. ఆమె పరిస్థితిలో మార్పు రాలేదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఏవేవో పూజలు చేసేది. విచిత్రంగా ప్రవర్తించేంది.
ఈ క్రమంలో.. యూట్యూబ్‌లో చూసి ఏవేవో పూజలు చేసింది. అప్పటికీ.. భర్త బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. గురువారం సూర్యాపేటలో పని ఉండటంతో అత్తమామలకు చెప్పి వెళ్లాడు. అప్పటికే.. మానసిక స్థితి కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్న భారతి.. పూజల పేరుతో ఆరు నెలల వయసున్న బిడ్డను హతమార్చింది. భారతి బీఈడీ చదువుకొని డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతోంది. కానీ ఇంతలోనే ఎవరో నాగదోషం అని చెప్పడంతో ఆమె పూర్తిగా మారిపోయి.. ఇలాంటి పనిచేసిందని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు మదనపల్లెలోనూ ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు తమ ఈడుకొచ్చిన ఇద్దరు కన్నబిడ్డలను నరబలి ఇచ్చారు. మళ్లీ ఇలాంటి సంఘటన జరగడంతో ఆందోళన మరింత తీవ్రమైంది.
Also Read: