మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. కని పెంచిన తల్లిదండ్రులను కదనుకుంటున్నారు కసాయి పిల్లలు. ఇటివల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఆస్తికోసం కన్న తల్లిదండ్రులను చితకబాదిన కొడుకు వ్యవహారం వెలుగు చూసింది. కసాయి కొడుకు దెబ్బలకు తల్లడిల్లి పోయిన వృద్ధ దంపతులు దండం పెట్టి వేడుకున్నా కనికరించని కొడుకు కర్కశుడిగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని అయోధ్య నగర్‌కు చెందిన వెంకటరమణారెడ్డి లక్ష్మమ్మలకు ఇద్దరు కొడుకులు. వారికి ఉన్న 2 ఎకరాల పొలం వారి ఇంట చిచ్చురాజేసింది. దీంతో కన్న కొడుకే కాలయముడుగా తయారయ్యేందుకు కారణమైంది. ఆస్తి తనకు రాసి ఇవ్వలేదని తల్లిదండ్రులపై చిన్నకొడుకు శ్రీనివాసులు రెడ్డి దాష్టీకాన్ని ప్రదర్శించాడు. తల్లిదండ్రులపై దారుణ ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. అమానుష ఘటన వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు మీడియా సహకారంతో ఘటనపై ఆరా తీశారు. కొడుకు చేతిలో చావు దెబ్బలు తిన్న వృద్ధ దంపతులను స్థానికుల సాయంతో గుర్తించారు.
హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలుసుకున్న మదనపల్లి 2 టౌన్ పోలీసులు.. వెంకట రమణారెడ్డి, లక్ష్మమ్మలను విచారించి ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కొడుకు శ్రీనివాసులు రెడ్డిపై కేసు నమోదు చేశారు. విచారణలో పలు విషయాలు తెలుసుకున్న పోలీసులు ఆస్తి వివాదమే ఈ దారుణానికి కారణమని గుర్తించారు.
మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లి అయోధ్యనగర్ లో కాపురం ఉంటున్న లక్షమ్మ , వెంకటరమణారెడ్డి లకు మనోహర్ రెడ్డి, శ్రీనివాసులురెడ్డిలకు ఇద్దరు కొడుకులు. స్థిరాస్తి పంపకాలలో తనకు సరైన న్యాయం చేయలేదని చిన్న కొడుకు శ్రీనివాసులు రెడ్డి తల్లిదండ్రులుపై విచక్షణ మరచి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కాళ్లతో తన్ని, నేలపై ఈడ్చుకుంటూ కొడుతున్నా స్థానికులెవరూ అడ్డగించే ప్రయత్నం చేయకపోయారు.
అయితే ఈ అమానుష ఘటనను మొబైల్‌లో వీడియో తీసి వైరల్ చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఎట్టకేలకు ఆ వైరల్ వీడియో శ్రీనివాసులు రెడ్డి దుర్మార్గాన్ని పట్టించింది. ఈ మేరకు మదనపల్లి 2 టౌన్ పీఎస్ లో పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు అయ్యింది. బాధిత తల్లిదండ్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులపై దాడికి పాల్పడిన శ్రీనివాసులు రెడ్డిని కఠినంగా శిక్షిస్తామని చెబుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…