The Kashmir Files: ఇంటర్‌నెట్ (Internet) వినియోగం ఎలా అయితే పెరుగుతూ పోతుందో అదే స్థాయిలో సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. ప్రతీ చిన్న అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు యూజర్ల ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నారు. ఇందుకోసం రోజుకో కొత్త అస్త్రాన్ని ఎంచుకుంటున్న సైబర్ మోసగాళ్లు తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని సైతం వదల్లేదు. కశ్మీర్‌లో 1990లో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని తమకు ఆసరగా మార్చుకున్నారు సైబర్ నేరగాళ్లు.
వివరాల్లోకి వెళితే.. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి అంటూ వాట్సాప్‌లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. అయితే సినిమా ఉచితంగా వస్తుందని క్లిక్ చేశారో స్మార్ట్ ఫోన్‌లోకి ఓ మాల్వేర్ వచ్చి చేరుతుంది. దీంతో మీ స్మార్ట్ ఫోన్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి.
ఈ విషయమైన నోయిడా అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రణ విజయ్ సింగ్ వినియోగదారులను హెచ్చరించారు. వాట్సాప్‌లో వైరల్ అవుతోన్న ఈ లింక్ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్‌తో పాటు మరే సోషల్ మీడియాలో సైట్లలో అయినా వైరల్ అయ్యే లింక్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
TS Govt Jobs: నిరుద్యోగులు వారి ట్రాప్‌లో పడకండి.. మంత్రి ఎర్రబెల్లి ఆసక్తికర వ్యాఖ్యలు