Pendurthi Murder Case: ఆ ఇంట్లో చెల్లాచెదురుగా మృతదేహాలు పడిఉన్నాయి. ఎటు చూసినా.. రక్తపు మడుగులే కనిపిస్తున్నాయి. వింటేనే ఒంట్లో వణుకువస్తుంది. అలాంటిది చూసిన వాళ్ల పరిస్థితిని ఒక్కసారి ఊహించుకోండి. పెద్దల నుంచి పసికందు వరకు ఆ దుర్మార్గుడు ఏమాత్రం కనికరం లేకుండా అత్యంత పాశవికంగా, దారుణంగా హత్యచేశాడు. వేట కొడవలితో ఆ కుటుంబంలోని ఆరుగురిని బలి తీసుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఇంట్లోకి ప్రవేశించి నరమేధం సృష్టించాడు. ఈ సంఘటన విశాఖపట్నంలోని పెందుర్తి మండలం జుత్తాడలో చోటుచేసుకుంది. పాత కక్షలకు ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. జుత్తాడలోని రెండు కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో బత్తిన అప్పల రాజు అనే వ్యక్తి తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న మరో కుటుంబంలోని ఆరుగురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనతో జుత్తాడలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతులు బొమ్మిడి రమణ(63), బొమ్మిడి ఉషారాణి(35), అల్లు రమాదేవి(53), నక్కెళ్ల అరుణ(37), ఉషారాణి పిల్లలు బొమ్మిడి ఉదయ్(2), ఉర్విష(6 నెలలు)గా గుర్తించారు. ఘటన తర్వాత నిందితుడు అప్పలరాజును పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలతోనే దాడి చేశాడా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నారు.
అయితే ఈ ఘటనకు వివాహేతర సంబంధమే కారణమని పేర్కొంటున్నారు. రమణ కొడుకు విజయ్, అప్పలరాజు కూతురు మధ్య వివాహేతర సంబంధముందని దీనిపై పంచాయతీ కూడా జరిగినట్లు సమాచారం. దీంతోపాటు పోలీస్ స్టేషన్, కోర్టులో కూడా కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో పాత కక్షలను మనస్సులో పెట్టుకున్న అప్పలరాజు విజయ్ కుటుంబసభ్యలపై గడ్డి కోసే కొడవలితో దాడి చేశాడు. అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు అప్పలరాజును తమకు అప్పజెప్పాలంటూ గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. పెద్ద వారితో పాటు అమాయకులైన చిన్న పిల్లలను దారుణంగా హతమార్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జుత్తాడ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.
Also Read: