UP Elections 2022: సమాజ్‌వాది పార్టీ సభలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు.. ఐదుగురు అరెస్ట్
Uttar Pradesh News: యూపీలోని ఆగ్రాలో సమాజ్‌వాది పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేయడం కలకలంరేపింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో సమాజ్‌వాది పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేయడం కలకలంరేపింది. ఇటీవల యూపీలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ సమాజ్‌వాది పార్టీ గురువారంనాడు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆగ్రాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు వ్యక్తులు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశారు. కొందరు వ్యక్తులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా పోలీసులు..ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులపై 147, 188, 269, 270, 153బీ, 505(2) 120 బీ తదితర సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఇందులో ప్రమేయమున్న మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని ఆగ్రా పోలీస్ కమిషనర్ రోహన్ ప్రమోద్ స్పష్టంచేశారు.
కాగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తులు తమ పార్టీ కార్యకర్తలు కారని సమాజ్‌వాది పార్టీ స్పష్టంచేసింది. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బయటి వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆ పార్టీ ఆగ్రా జిల్లా అధ్యక్షుడు వాజిద్ నిసార్ స్పష్టంచేశారు. ఓ వ్యక్తి పాక్ అనుకూల నినాదాలు చేసినట్లు తెలిసిందని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు తమ పార్టీ తరఫున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
సమాజ్‌వాది పార్టీ కార్యకర్తలు పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు చేయడం దారుణమంటూ బీజేపీ ఉత్తరప్రదేశ్ నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సైతం యూపీ బీజేపీకి సంబంధించి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సమాజ్‌వాది పార్టీ పాకిస్థాన్ నుంచి పనిచేస్తోందా? అంటూ ధ్వజమెత్తింది.
आज आगरा में समाजवादी पार्टी के शहर अध्यक्ष वाजिद निसार के नेतृत्व में भाजपा के खिलाफ निकाली गई रैली में पाकिस्तान जिंदाबाद के नारे लगाए गए। क्या समाजवादी पार्टी पाकिस्तान से संचालित हो रही है? pic.twitter.com/SBiecYZEnT
— BJP Uttar Pradesh (@BJP4UP) July 15, 2021
వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాది పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండొచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించుతామని ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తంచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. 403 అసెంబ్లీ స్థానాలు కలిగిన యూపీలో..2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాలు గెలుచుకోగా..సమాజ్‌వాది పార్టీ 54 స్థానాలు, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 19 స్థానాల్లో గెలిచింది. 5 స్థానాల్లో ఇండిపెండింట్ అభ్యర్థులు విజయం సాధించారు.
Also Read..
తలవంపులు తెచ్చిన కేసు.! : రాజ్ భవన్ కు కాంగ్రెస్ జెండాలు కట్టిన వ్యవహారంలో సీరియస్.. అరెస్టులు
Shobha Hymavathi: తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తిలోదకాలు