Cyber Crime: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలను అవలీలగా మోసం చేస్తున్నారు. మొన్నటి వరకు ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలతో డబ్బులను దోచుకున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు.. ఇందుకు వాట్సాప్‌ను వినియోగించుకుంటున్నారు. అయితే ఈసారి ఈ నయా దందా అమెరికా కేంద్రంగా జరుగుతుండడం గమనార్హం..
అమెరికాలో నివసిస్తున్న కొందరి ఫొటోలను సేకరించి వాటిని వాట్సాప్ డిపీగా పెడుతున్నారు. అనంతరం వారి ఫోన్లలో ఉన్న కాంటాక్ట్ నెంబర్లను సేకరించి.. ఇండియాలో ఉన్న వారి సన్నిహితులకు మెసేజ్ చేస్తున్నారు. భారత్‌లో ఉన్న తమ సన్నిహితులు అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్నారని.. తాను అమెరికా నుంచి డబ్బులు పంపించాలంటే సమయం పడుతుందని, కాబట్టి తాను తెలిపిన అకౌంట్ నెంబర్‌కు వెంటనే డబ్బులు పంపించాలని మెసేజ్ పంపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురి వాట్సాప్ నెంబర్లకు ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ బోయిన్‌పల్లికి చెందిన దిలీప్ కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు న్యూయార్క్‌లో ఉంటున్న తన స్నేహితుడు రమేశ్ ప్రొఫైల్ ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. తన బాబాయ్ కరోనాతో ఆసుపత్రిలో చేరాడని. అత్యవసరంగా రూ. 2 లక్షలు అవసరం ఉన్నాయని, డబ్బులు పంపిస్తే రెండు రోజుల్లో తిరిగి పంపిస్తామని మెసేజ్ వచ్చింది. దీంతో వెనకా ముందు ఆలోచించని దిలీప్ వెంటనే రూ.2 లక్షలను పంపించాడు. అనంతరం కాసేపటి తర్వాత రమేశ్‌కు కాల్ చేసి ఈ విషయమై అడగ్గా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని సమాధానం ఇచ్చాడు. అప్పుడు కానీ దిలీప్‌కు అర్థంకాలేదు తాను మోసపోయానని. వెంటనే పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు.
ఇలాంటి మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా డబ్బుల కోసం మెసేజ్‌లు చేస్తే వారికి నేరుగా ఫోన్ చేసి కనుక్కున్న తర్వాతే లావాదేవీలు జరపాలని సూచిస్తున్నారు. ఇక వాట్సాప్‌లో తమ ఫొటోలు అందరికీ కనిపించకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఫోన్‌లో మాట్లాడితే గుర్తు పడతారనే కారణంగా మోసగాళ్లు కేవలం చాటింగ్ మాత్రమే చేస్తున్నారు. ఇలాంటి నెంబర్లన్నీ +1 కోడ్‌తో వస్తున్నాయి. కాబట్టి ఇతర దేశాల నెంబర్లని మోసపోయి వెంటనే డబ్బులు పంపిస్తున్నారు. ఇదిలా ఉంటే డబ్బులు పంపించాలని సైబర్ నేరస్థులు పంపిస్తోన్న అకౌంట్ నెంబర్లన్నీ బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోవి ఉంటున్నాయి.
Also Read: Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో ఎల్‌టీఈ టాప్ కమాండర్
Cyber Crime: హైదరాబాద్‌లో మరో సైబర్ మోసం.. KYC అప్‌డేట్ పేరుతో 9 లక్షలు మాయం..
Lightning Strike: పిడుగుపాటుకు ఐదుగురు బలి.. మృతుల్లో నలుగురు చిన్నారులు..