‘ప్రేమ’.. భారతదేశంలో నమోదైన హత్య కేసుల్లో మెజార్టీ వాటికి కీలక పాత్ర పోషించేది ఈ అంశమేనని పోలీసు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం అధిక శాతం హత్యలు ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాల వల్లే జరుగుతున్నాయట. అంతేకాకుండా గతంలో కంటే ఇప్పుడు దేశంలో హత్యలు తగ్గాయని ఆ రిపోర్ట్ పేర్కొంది. ఇకపోతే 2001-17 మధ్య జరిగిన హత్యలకు కారణాల్లో ‘ప్రేమ’ ప్రముఖంగా ఉండటం గమనార్హం.
ప్రేమ కారణంగా జరిగిన హత్యల్లో తెలుగు రాష్ట్రాలతో పాటుగా పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రలు మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. మరోవైపు కక్షలతో కూడిన హత్యలు, ఆస్తుల కోసం జరిగే హత్యలు కూడా చాలావరకు తగ్గాయని.. అయితే పరువు హత్యలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయని రిపోర్టు విశ్లేషించింది.
2001లో 36,202 హత్య కేసులు నమోదు కాగా.. 2017లో 28,653 కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. అంటే సుమారు 21 శాతం తగ్గాయి. ఇక 2016లో 71 పరువు హత్య కేసులు నమోదైతే.. ఆ సంఖ్య 2017లో 92కు చేరుకుంది.