చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. ఆ మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత కామాంధుల్లో మార్పు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ సీన్స్ రిపీట్ అవుతూనే ఉన్నాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన జరిగి నెలరోజులు కూడా కాలేదు… మళ్లీ అనేక చోట్ల వరుసగా అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు చోటుచేసుకుంటున్నాయి.
తాజాగా తెలంగాణలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో.. జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్ విషయంలో ఆ గ్రామపెద్దలు.. నిందితులకు వత్తాసుగా అక్కడికక్కడే సెటిల్ చేశారు. అయితే ఈ విషయం ఆ నోట ఈనోట బయటికి రావడంతో.. జరిగిన తతంగం అంతా బయటకొచ్చింది. వివారాల్లోకి వెళితే.. గుండ్రవానిగూడెం గ్రామంలో ఓ మైనర్ బాలిక.. బహిర్భూమి కోసం బయటకెళ్లింది. అయితే అదేసమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు గ్రామ పెద్దలకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే గ్రామపెద్దలు నిందితులకు వత్తాసు పలుకుతూ.. ఈ తతంగాన్ని బయటకు రానివ్వకుండా చేశారు. బాధితురాలి కుటుంబానికి నచ్చజెప్తూ.. కొంత మొత్తంలో డబ్బును ముట్టజెప్పి.. ఏకంగా ఆ గ్రామం నుంచే పంపించేశారు. అయితే ఈ విషయం మెల్లిగా బయటకు రావడంతో.. పోలీసుల దాకా చేరింది. దీంతో ఈ సీన్‌లోకి ఎంటర్ అయిన పోలీసులు.. గ్రామ ప్రజలతో సమాచారాన్ని రాబడుతున్నారు. ఆరోపణలు వస్తున్న గ్రామ పెద్దలను కూడా విచారిస్తున్నారు.