Adulterated milk products: దేవుడి అభిషేకానికి, మన ఆరోగ్యానికి పాలు ఎంతో శ్రేష్టమైనవి. నిజమే..కానీ డిమాండ్ అండ్ సప్లయ్ లాజిక్‌తో పాల చాటున పాపాలు పెరుగుతున్నాయి. మేడిపండు సామెతలా మిల్క్ డెయిరీల్లో పొగలు కక్కుతోన్న కల్తీ ప్రజారోగ్యాన్ని కాటేస్తోంది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు..కరెస్టే. కానీ కడవలు కాదు ట్యాంకుల కొద్దీ తయారవుతోన్న ఇదిగో కల్తీ పాలు తాగితే మృత్యుపాలు కావడం ఖాయం. ఔను..పాపాల బైరవులు బయలెళ్లారు. కాసుల కక్కుర్తితో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీ పాల దందాలో ఏపీ(AP), తెలంగాణ(Telangana) దేశంలోనే టాప్. కానీ ఉక్కుపాదం మోపడంతో ఖేల్ కతమ్..కల్తీ దుక్నం బంద్ అయిందనుకున్నారంత. కానీ మిల్క్ మాఫియా పాపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయనే నిజం తాజాగా తెరపైకి వచ్చింది. హైదరాబాద్(Hyderabad) శివారు సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని పవిత్ర డెయిరీ(Pavitra Dairy) బాగోతం బయటపడింది.
పేరుకి పవిత్ర డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్. కానీ లోపలం జరుగుతున్న తతంగం మాత్రం పాలకూట విషం. అవును.. కల్తీ పాలు, పెరుగు, పన్నీరు.. ఇలా అన్నింటిని కెమికల్స్‌తో తయారు చేస్తూ ప్రముఖ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నారు. అమూల్, హెరిటేజ్, గోవర్ధన్ లాంటి కంపెనీల స్టిక్కర్లు అంటించి మార్కెట్‌లో మాయచేస్తున్నారు. పక్కా సమాచారంతో డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో పవిత్ర డెయిరీలో సోదాలు జరిపితే కల్తీ కుతంత్రం బయటపడింది.
కల్తీ పాలు, పెరుగు తయారీ కోసం యూరియా, డిటర్జెంట్, స్టార్చ్.. మంచి వాసన కోసం కొన్ని రకాల రసాయనాలను వాడుతున్నారు. గంటల వ్యవధిలో గడ్డ పెరుగు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. పాలు, పెరుగుకి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.
కల్తీపాలను ప్రముఖ సంస్థల లేబుళ్లతో హోటళ్లు, రెస్టారెంట్లు, కిరణా షాప్స్‌కి సప్లయ్ చేస్తున్నారు. తక్కువ ధరకు రావటం, కల్తీ ఉత్పత్తులు అని గుర్తించే అవకాశం లేకపోవటం దందాకు అనుకూలంగా మారిందంటున్నారు పోలీసులు. కల్తీ ఉత్పత్తులకి సంబంధించి 6వేల లీటర్ల పౌడర్‌ను సీజ్ చేశామన్నారు పోలీసులు. పవిత్ర డెయిరీ అపవిత్ర పాల దందా సెటప్ చూసి పోలీసులే కంగుతిన్నారు. ఈ తంతు ఎన్నాళ్లుగా సాగుతోంది. ఎవరి అండదండలతో? కల్తీ చేయడం నేరం. పేరున్న బ్రాండ్ల పేరిట మార్కెటింగ్ చేయడం మరో మోసం. ఈ గోల్‌మాల్ ఓ లెక్కయితే. ఇక పల్లెబాటలో డెయిరీలకు విక్రయిస్తున్న పాలలో కూడా విషం పాలే ఎక్కువ. పాలలో చిక్కదనం కోసం.. వెన్నశాతం ఎక్కువగా చూపడం కోసం ఏకంగా యూరియా, సన్‌ఫ్లవర్ ఆయిల్ సహా రకరకాల కెమికల్స్‌ను కలుపుతున్నారు.
దొరికితే దొంగ. దొరకనంత వరకు దర్జా దోచుకోవచ్చు. పాలలో నీళ్లు కలిపితే కక్కుర్తి అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఏకంగా కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు. మరి కల్తీ పాలను గుర్తించడం ఎలా?..జాగ్రత్తగా పరిశీలిస్తే కల్తీ పాలను గుర్తించవచ్చు. వాసన పసిగట్టినా అసలా.. నకిలా అన్న తేడా తెలిసిపోతుంది. నేలపై వేసినప్పుడు కల్తీ పాలైతే వాటిలో ఎక్కువ కదలిక ఉండదు. కల్తీ పాలు, కల్తీ పెరుగులను కొంటే.. విషం తిన్నట్టే. వాటిలో వాడే కెమికల్స్ వల్ల ఆరోగ్యానికి ఎంతో హాని వుందంటున్నారు వైద్యులు. కల్తీ మిల్క్ ప్రొడక్ట్స్‌లో క్లాస్టిడ్మిం, ఈకోలై, సాల్మానెల్లా ప్రమాదకర బ్యాక్టీరియాతోపాటు రోటా వైరస్ కూడా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, వాంతులు, వీరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్లు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు అధికం. ఇలాంటి కల్తీ పాలను తాగిస్తే పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుల లోపిస్తుంది.
దేశమంతటా కల్తీ పాల దందా జోరుగా సాగుతోంది. ఆ తెగులు మన తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా వుంది. ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపినా సరే పల్లె నుంచి పట్నం దాకా కల్తీ కాటు తప్పడం లేదు. బ్రాండెడ్ నమ్మకానికి కూడా గండి కొడుతున్నారు పవిత్ర డెయిరీ వంటి కేటుగాళ్లు. పాలే కదా అని ఉపేక్షిస్తే కల్తీ కాటు సమాజానికే చేటు. మీ చుట్టుపక్కల ఎవరైనా కల్తీకి పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. కల్తీ మాఫియాను కట్టడి చేయడం మనందరి బాధ్యత.
Also Read: Dwayne Bravo: ఇంటా.. బయటా అదే స్టెప్.. ‘శ్రీవల్లి’ మాయలో పడ్డ క్రికెటర్ బ్రావో..