Man Thrashes CA Wife: ఎవరైనా కలకాలం కలిసుండాలని పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ వ్యక్తి కేవలం ఆ మహిళ జీతం కోసమే పెళ్లి చేసుకున్నాడు. జీతం ఇవ్వడం లేదంటూ.. భార్యను నిత్యం కొడుతూ చిత్ర హింసలకు గురిచేసేవాడు.. చివరకు అతడి వేధింపులు తట్టుకోలేని మహిళ.. పోలీసులను.. ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షాకింగ్ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. అహ్మదాబాద్‌లోని నానా చిలోడా ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల మహిళ వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్. 2018 ఆగస్టులో నానా చిలోడా ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే.. అప్పటినుంచి తన భర్త తన జీతం తీసుకుంటున్నాడని.. అభ్యంతరం చెబితే తనపై దాడి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీతంలో కొంత తక్కువైనా దారుణంగా కొట్టేవాడని మహిళ పోలీసులకు తెలిపింది. ఈ మేరకు మహిళ తన భర్తపై మంగళవారం గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది.
అయితే.. వివాహం జరిగిన వెంటనే.. తన భర్త జీతం మొత్తం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తాడు.. కానీ తన జీతం మొత్తం అప్పగించాలని కొట్టేవాడని.. తనకు ఖర్చుల కోసం కూడా ఇచ్చేవాడు కాదని తెలిపింది. జీతం కోసమే తనను పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నాడని.. నిరాకరిస్తే వదిలేస్తానంటూ బెదిరించాడని ఆ మహిళ చెప్పింది. ఆఫ్రికాలోని బోట్స్‌వానాలో ఉద్యోగం కోసం వెళ్లగా.. అక్కడ కూడా తనను వేధించాడని.. అదనపు కట్నం తీసుకురావాలంటూ కొట్టేవాడని తెలిపింది. భర్త వేధింపులు తట్టుకోలేక గతనెల భారతదేశానికి తిరిగి వచ్చినట్లు తెలిపింది.
అనంతరం అత్తారింటికి వెళ్లగా.. అత్తమామలు తమ ఇంటికి రావొద్దాన్నారని.. మొత్తం జీతం ఇస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టమన్నారని మహిళ వివరించింది. ప్రస్తుతం పుట్టింటి దగ్గర ఉంటున్న మహిళ.. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.
Also Read: