ఈజీ మనీ కోసం.. అమాయకులను మోసం చేయటానికి కేటుగాళ్లు ఎన్నెన్నో కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. ఇక తాజాగా ప్రముఖ నటి శ్రియ డేట్స్ ఇప్పిస్తానంటూ.. ఓ మీడియా ప్రతినిధి ఏకంగా రూ.5 లక్షలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. ఈ కేసులో అతనికి ఓ మహిళ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బంజారా హిల్స్‌కు చెందిన చంద్రనాయుడు అనే సినీ దర్శకుడు తన ఛానల్‌లో పెద్ద ఎత్తున రియాలిటీ షోకు భారీగా ప్లాన్ చేశాడు. ఇక ఆ షోకు సీనియర్ నటి శ్రియ జడ్జిగా వ్యవహరిస్తే.. టీఆర్పీ రేటింగ్స్ బాగుంటాయని అనుకున్నాడు. అంతేకాకుండా ఆమెను కాంటాక్ట్ కావడం కోసం.. పలువురితో డీలింగ్స్ కూడా చేసుకున్నాడు. ఈ తరుణంలో మీడియా ప్రతినిధి అయిన చైతన్య అతనికి పరిచయమయ్యాడు. సదరు దర్శకుడు, చైతన్యకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాడు. ఇక డబ్బు మీద దుర్బుద్ధి కలిగిన చైతన్య పక్కాగా ఓ స్కెచ్ వేశాడు.
హీరోయిన్ శ్రియ డేట్స్ అన్నింటినీ చూసే మేనేజర్ ఈమేనంటూ లక్షీ సింధూజ అనే అమ్మాయిని పరిచయం చేయడమే కాకుండా.. ఆమెకు ఆ దర్శకుడు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇప్పించేలా చైతన్య ప్రేరేపించాడు. ఇంకేముంది డబ్బు మొత్తం ముట్టిన తర్వాత ఈ జంట కనిపించకుండా పోయింది.
సదరు దర్శకుడు వివిధ మార్గాల ద్వారా వారిని కాంటాక్ట్ చేద్దామని చూసినా ఉపయోగం లేకుండా పోయింది. చివరికి తాను మోసపోయానని తెలుసుకున్న చంద్రనాయుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఇక అతడిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.