Khammam Crime News: డబ్బు ఏదైనా చేయిస్తుందని.. ఎలాంటి బంధాల మధ్యనైన చిచ్చు రేపుతుంది.. డబ్బు జబ్బుకు.. పచ్చని సంసారమైనా.. వెన్నుదన్నుగా నిలిచే స్నేహ బంధమైనా బలికావాల్సిందే. ఒకరి ప్రాణం పోయాలన్నా.. తీయాలన్నా డబ్బు కేంద్రంగా మారుతుందనడానికి ఈ ఘటన నిదర్శనంగా మరింది. తాజాగా.. రూ. వంద నోటు నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. మరొకరిని కటకటాల పాలు చేసింది. కూలి డబ్బులు రూ.100 కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లాకు వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య రూ.వంద నోటు అగ్గి రాజేసి.. ఒకరి జీవితాన్ని బుగ్గి చేయగా.. మరొకరిని ఉచలు లేక్కబెట్టేలా చేసింది.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని రఘునాథపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన 20 మంది కూలీలు రెండు నెలల కిందట రఘునాథపాలెం మండలం ఎన్వీ బంజరకు వ్యవసాయ పనుల కోసం వచ్చారు. ఈ క్రమంలో వారంతా కూలీ పనులు చేసుకుంటూ అక్కడే నివాసముంటున్నారు. అయితే కూలీ పనుల కోసం దయాళ్, సేత్‌రాం అనే ఇద్దరు స్నేహితులు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఓ రైతు వద్ద పని చేయగా వచ్చిన కూలీ డబ్బుల విషయంలో దయాళ్, సేత్‌రాంల మధ్య వాగ్వాదం తలెత్తింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ చాలా సేపు గొడవపడ్డారు. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఈ సమయంలో క్షణికావేశానికి గురైన సేత్‌రాం.. చాకుతో దయాళ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఛాతీపై బలంగా పొడవడంతో దయాళ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: