మనం దేశంలో లాజిక్కులకంటే మేజిక్కులను జనం బాగా నమ్ముతారు. బురిడీ బాబాలు, వింత పూజలు చేస్తే.. సమస్యలు పరిష్కారం అవుతాయంటే.. ముందూ, వెనుక ఆలోచించకుండా ఆ పనుల్లో నిమగ్నమవుతారు. ఆ తర్వాత మోసపోయామంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. తాజాగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని కుందుల రోడ్ లో శ్రీ బంగారు తల్లి కోయ దేవతల జ్యోతిష్యాలయం పెట్టి మోసాలకు పాల్పడుతున్న నెర్లకంటి బాలాజీ అనే వ్యక్తి బాగోతం వెలుగులోకి వచ్చింది. తన వద్దకు వచ్చిన ప్రజలను మూఢనమ్మకాలతో నమ్మించి, సమస్యల పేరుతో భయపెడుతూ వారి వద్ద నుండి అధిక మొత్తాలలో బాలాజీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గత సంవత్సరం ఆగస్టు నెలలో నిందితుడు నేర్లకంటి బాజీ అలియాస్ బాలాజీ వద్దకు ఒక మహిళా వైద్యురాలు.. తనకు, తన భర్తకు మధ్యగల కుటుంబ సమస్యను పరిష్కరించాలని వెళ్ళింది. ఈ క్రమంలో నిందితుడు సదరు మహిళను మూఢనమ్మకాల పేరుతో బెదిరించి ఆమె వద్ద నుండి పలు రకాల పూజల పేరుతో సుమారు పది లక్షల రూపాయల నగదు, 20 గ్రాముల బంగారం తీసుకొని మోసం చేశాడు. ఆలస్యంగా నిందితుడి నిజస్వరూపం అర్థం చేసుకున్న మహిళ పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడైన బాలాజీని అరెస్టు చేశారు. అతని వద్దనుండి 10 లక్షల రూపాయల నగదు, 20 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, కొన్ని పుస్తకాలు, విజిటింగ్ కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండుకు పంపారు.
Also Read:బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జగన్.. సొగసరి షాట్లతో ఫిదా చేశారు