Crime News: ఆగని లోన్ యాప్ ఆగడాలు.. బలైన మరో ప్రాణం..

|

Jul 13, 2022 | 7:49 AM

నెత్తురుమరిగిన లోన్‌ యాప్‌ మాఫియా కోల్డ్‌ బ్లడెడ్‌ మర్డర్స్‌ చేస్తోంది. వద్దన్నా అప్పులిస్తోన్న కంత్రీగాళ్లు, వడ్డీల మీద వడ్డీలేసి, అసలు ప్లస్ వడ్డీ కింద ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

Crime News: ఆగని లోన్ యాప్ ఆగడాలు.. బలైన మరో ప్రాణం..
Loan app
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో లోన్‌ యాప్స్‌ మరణమృదంగం మోగిస్తున్నాయి. అవసరానికి ఆదుకుంటాయని లోన్‌ యాప్స్‌ను ఆశ్రయిస్తే, ఆయువునే తీసేస్తున్నాయి. చిటికెలో లోన్‌ అంటూ చేతికి నెత్తురంటకుండా లోన్‌ మాఫియా కేటుగాళ్లు చంపేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ లోన్‌ యాప్స్‌ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. లోన్‌ యాప్స్‌ మాఫియా దారుణాలకు మరో ప్రాణం బలైపోయింది. గుంటూరు జిల్లా చినకాకానిలో ఓపెక్స్‌ లోన్‌ యాప్‌ ద్వారా 30వేల రూపాయల రుణం తీసుకున్న ఓ వివాహిత, వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. 30వేలకు 2లక్షల రూపాయలు చెల్లించినా, ఇంకా కట్టాలంటూ వెంటపడటంతో ప్రత్యూష ఉరి వేసుకుంది.

తెలంగాణలోనూ లోన్‌ యాప్‌ ఆగడాలకు మరో ప్రాణం బలైపోయింది. లోన్‌ మాఫియా ఉచ్చులో చిక్కుకున్న గోదావరిఖని యువకుడు ప్రశాంత్‌ ప్రాణాలు తీసుకున్నాడు. మనీవ్యూ యాప్‌ ద్వారా 60వేల రూపాయల రుణం తీసుకున్న ప్రశాంత్‌.. తిరిగి డబ్బు చెల్లించలేకపోవడంతో లోన్‌ మాఫియా వేధింపులకు దిగింది. ఒకవైపు పదేపదే ఫోన్లు చేస్తూ బండ బూతులు తిట్టడం, మరోవైపు నగ్న ఫొటోలతో ముప్పేట దాడి చేయడంతో, తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

అయితే, ప్రశాంత్‌ సూసైడ్‌ చేసుకున్నా వేధింపులు ఆగలేదు. అతని తల్లిదండ్రుల ఫొటోలను కూడా మార్ఫింగ్‌ చేసి, వేధింపులకు దిగింది లోన్‌ మాఫియా. లోన్‌ యాప్స్‌ ఆగడాలపై ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా స్పందించారు. యాప్‌లను బ్లాక్‌ చేసేందుకు చర్యలు చేపట్టాలని ఏపీ డీజీపీకి లేఖ రాశారు. లోన్‌ మాఫియా ఆటకట్టించాలని సూచించారు.