Leopard Attack: అడవుల్లో ఉండే వన్యప్రాణులు అడపదడపా నగరాల్లోకి వచ్చి తరచూ హల్‌చల్ చేస్తున్నాయి. అవి వనాలను విడిచిపెట్టి జన జీవనంలోకి ఎందుకు వస్తున్నాయో కారణం తెలియదు. మరోవైపు అటవీ అధికారులు భద్రతా ప్రామాణాలు సరిగా పాటించకపోవడం కూడా ఓ కారణమే అవుతోంది. అయితే అడవిలో ఆహారం లభించక క్రూర మృగాలు ఇలా జనావాసాల్లోకి రావడం పరిపాటి అని అటవీఅధికారులు అంటున్నారు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ చిరుత బీభత్సం సృష్టించింది. మూగ జంతువులపై దాడి చేసి చంపేసింది. దీంతో స్థానికులు భయందోళన చెందుతున్నారు.
నిన్న అర్ధరాత్రి ఉప్పునుంతల శివారులో చిరుత కలకలం సృష్టించింది. ఓ పశువుల పాకలో కట్టేసి ఉన్న గొర్రెలు, ఆవుల మందపై దాడి చేసింది. చిరుత దాడిలో ఏడు గొర్రెలు, ఒక గేదె మృతి చెందాయి. దీంతో రైతు ఆంజనేయులు లబోదిబోమంటున్నాడు. భారీగా నష్టపోయాడు. ఉప్పునుంతల శివారులో చిరుత సంచరిస్తోందన్న వార్తతో గ్రామస్తులు, రైతులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. అటవీ అధికారులు వెంటనే చిరుతను పట్టుకొని తరలించాలని కోరుతున్నారు.
తమ జీవనాధారం గొర్రెలు, ఆవు మాత్రమే అని వాటిని పెంచి పోషించి.. వాటినే అమ్ముకొని జీవిస్తున్నామని, కూడబెట్టిన ఆస్తులు కూడా ఏమీ లేవని తమ గోడు వెల్లబోసుకున్నాడు. వీటిపై వచ్చిన ఆదాయంతోనే పిల్లల్ని చదివించుకుంటున్నామని, నోటికాడికి ఇంత ముద్ద వస్తుందంటే వాటివల్లేనని.. అవే ఇప్పుడు మృత్యువాతపడ్డాయని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. ఉపాధి పోవడంతో పాటు లక్షల రూపాయలు నష్టపోవడంతో ప్రభుత్వం రైతు ఆంజనేయులును ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.