Khammam: మామిడి, పామాయిల్, సుబాబులు తోటల్లో ఏకంగా వడ్లు పండించిన ఘనులు
అక్కడ మామిడి చెట్లకు వడ్లు కాశాయి.! పామాయిల్, సుబాబుల్ తోటల్లో ధాన్యం పండింది. ఇదేం విచిత్రం అనే కదా మీ డౌట్.! దొంగలు, దొంగలు
Khammam – PACS Cheating: అక్కడ మామిడి చెట్లకు వడ్లు కాశాయి.! పామాయిల్, సుబాబుల్ తోటల్లో ధాన్యం పండింది. ఇదేం విచిత్రం అనే కదా మీ డౌట్.! దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటే ఇలాగే ఉంటుంది మరి.! ఈ ఖతర్నాక్ దోపిడీ కథా చిత్రమ్ ఏంటో చూద్దాం..!. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే ప్రధాన ఆధారం. ఇలాంటి కీలకమైన రంగానికి సేవలందించడంలో వ్యవసాయ సహకార సంఘాలు-PACSలది ముఖ్య పాత్ర. కానీ ఇక్కడ మాత్రం రివర్స్‌లో జరిగింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు..సోసైటీ ఛైర్మనే బరితెగిస్తే..ఏ రేంజ్‌లో అక్రమాలు చేయచ్చో చూపించే క్రైమ్ స్టోరీ ఇది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సాధారణంగా తరుగు, హమాలీల ఛార్జీల చెల్లింపుల విషయంలో రైతుల్ని దోపిడీ చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా మామిడి, పామాయిల్, సుబాబుల్ తోటల్లో వరి పండినట్లు రికార్డులు సృష్టించారు. ఆ ధాన్యాన్ని సహకార సంఘాల ద్వారా మిల్లర్లకు విక్రయించినట్లు ఫేక్ ట్రక్‌షీట్లు క్రియేట్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 7,300క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు బిల్లులు రాసి.. కోటీ 40 లక్షలకుపైగా కొల్లగొట్టారు.
ఖమ్మం గ్రామీణ మండలం ఎదులాపురం సహకార సంఘం ఏటా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుంది. గత రబీ సీజన్లో మొత్తం 8 సెంటర్ల ద్వారా 1,450 మంది రైతుల నుంచి 59,274 క్వింటాల వడ్లు కొన్నారు. వీటి విలువ 11 కోట్ల 2 లక్షల పైనే. అయితే ఈ సొమ్మును కాజేయడంపై కన్నేశారు సొసైటీ ఛైర్మన్. వడ్లు కొనకుండానే కొన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. పైగా వ్యవసాయ రికార్డుల్లో మామిడి, పామాయిల్, సుబాబులు తోటలుగా రికార్డైన భూముల్లో వరి సాగు చేసినట్లు రాశారు. మిల్లర్లనే కౌలు రైతులుగా చూపి.. వారి అకౌంట్లలో నగదు వేశారు. ఆ తర్వాత అంతా కలసి ఆ సొమ్ము పంచుకున్నారు.
ఇప్పుడు ఈ వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. సొసైటీ ఛైర్మన్ ధర్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లంతా కంప్లైంట్ చేశారు. అటు ఉన్నతాధికారులూ ఈ వివాదంపై స్పందించారు. ఏం జరిగిందో తేల్చేందుకు కమిటీని నియమించారు. అదీ సంగతి..! ఏకంగా మామిడి, పామాయిల్, సుబాబులు తోటల్లో వడ్లు పండిచినట్లు రికార్డులు సృష్టించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనేది తేలాల్సి ఉంది.
Read also: CM KCR: కరోనాతో కష్టాల్లో మెట్రో. ఆదుకోవాలంటూ ఉన్నతాధికారుల అభ్యర్థన.. సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..