AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్ బుక్ ప్రియురాలి కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల భారత కుర్రాడు అరెస్ట్

తమిళనాడులోని అరియలూరుకు చెందిన 17 ఏళ్ల బాలుడికి ఫేస్ బుక్ లో శ్రీలంకకు చెందిన  14 ఏళ్ల మైనర్ బాలిక పరిచయమైంది. ఆమెను కలిసేందుకు శ్రీలంక సముద్ర సరిహద్దులను అక్రమంగా దాటే ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు మన్నార్ కోర్టులో హాజరుపరచగా కోర్టు చైల్డ్ హోమ్ కు తరలించింది. 

ఫేస్ బుక్ ప్రియురాలి కోసం శ్రీలంక వెళ్లిన 17 ఏళ్ల భారత కుర్రాడు అరెస్ట్
Indian Teenager Arrested In Sri Lanka For Meeting Facebook Lover
Sharada V
|

Updated on: Sep 18, 2026 | 2:39 PM

Share

చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఆధార్ గుర్తింపు కార్డు లేదు.. ప్యాంటు జేబులో ఉన్నది 280 రూపాయలే .. ఆ చిన్న మొత్తంతో,  గుండెల నిండా ధైర్యంతో  17 ఏళ్ల టీనేజ్ కుర్రాడు శ్రీలంక వెళ్లే సాహసం చేసాడు. అతనికి ఫేస్ బుక్ ద్వారా ఓ 14 ఏళ్ల బాలిక పరిచయమైంది. బాలిక  పై మనసు పారేసుకున్న తమిళ టీనేజ్ బాలుడు తన ప్రియురాలిని కలిసేందుకు శ్రీలంకలోకి అక్రమంగా ప్రవేశించాడు.  బాలికను నేరుగా చూడాలన్న ఆశతో .. శ్రీలంకకు వెళ్లడానికి  తొలుత రామేశ్వరం వచ్చాడు.  శ్రీ లంక తీసుకెళ్లాలని రామేశ్వరంలో  ఒక  బోటు ఆపరేటర్‌ను  ప్రాధేయపడ్డాడు.  బదులుగా తన మెడలోని బంగారు గొలుసు తీసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు.  పడవ ఆపరేటర్ అంగీకరించడంతో  బేరం కుదిరింది.  అయితే, పాక్ జలసంధిని దాటించిన ఆ వ్యక్తి  శ్రీలంకలోని తలైమన్నార్ సమీపంలో  జనసంచారం లేని ఓ ఇసుక దిబ్బపై కుర్రాడిని దింపాడు. స్థానిక శ్రీలంక పడవ వచ్చి తీసుకెళుతుందని,  భయపడకుండా వేచి చూడాలని చెప్పి దింపి వెళ్లిపోయాడు.  బోటు ఆపరేటర్ మాటలు నమ్మి కుర్రాడు ఆ నిర్జన ప్రాంతంలో శ్రీలంక పడవ కోసం గంటల తరబడి వేచి చూసాడు.  ఒంటరిగా ఇసుక దిబ్బ పై నీరసంగా కూర్చున్న బాలుడిని గమనించిన శ్రీలంక నావికాదళం అధికారులు సెప్టెంబర్ 11న అతడ్ని రక్షించారు.  ఒడ్డుకు చేర్చి ఆహారం, తాగునీరు అందించడంతో పాటు వైద్య పరీక్షలు చేయించారు.  ఆ తర్వాత చట్టపరమైన చర్యల కోసం తలైమన్నార్ పోలీసులకు కుర్రాడిని అప్పగించారు.

Indian Teenager Left Alone In Sand Bank Near Sri Lanka

Indian Teenager Left Alone In Sand Bank Near Sri Lanka

తల్లి శ్రీలంక వాస్తవ్యురాలు

పోలీసుల విచారణలో కుర్రాడి కుటుంబ వివరాలు తెలిసాయి.  కుర్రాడి తల్లి శ్రీలంకకు చెందిన వ్యక్తి కాగా, ఆ కుర్రాడు భారతదేశంలో జన్మించిన భారతీయ పౌరుడని తేలింది.  అయితే, తన జాతీయతను ధ్రువీకరించే గుర్తింపు కార్డు కానీ సరైన ప్రయాణ పత్రాలు కానీ లేకుండానే అక్రమంగా ప్రవేశించడంతో సెప్టెంబర్ 12న శ్రీలంకలోని మన్నార్ కోర్టులో అతడిని హాజరుపరిచారు.  అయితే కోర్టులో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.  కుర్రాడి నానమ్మ తనే నంటూ ఒక వృద్ధురాలు ముందుకు వచ్చారట. అయితే వారి మధ్య బంధాన్ని నిరూపించే అధికారిక  పత్రాలు సమర్పించాలని కోర్టు కోరగా ఆమె తన దగ్గర ఫొటోలు లేవని చెప్పారట. దాంతో  కుర్రాడిని ఆమెకు కస్టడీ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దర్యాప్తు నివేదిక అందే వరకు కుర్రాడిని ప్రభుత్వ  సంరక్షణ హోమ్‌లో ఉంచాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసారు.

Follow Us