Hyderabad: హైదరాబాద్‌లో మొన్నటి వరకు డ్రగ్స్, పబ్స్ గబ్బు, క్యాసినో డెన్స్.. ఇవే ఎక్కువగా వినిపించాయి. అయితే ఇప్పుడీ జాబితాలోకి కోడి పందేలు, పేకాట స్థావరాలు వచ్చి చేరాయి. గడిచిన కొన్ని రోజుల్లో వెలుగులోకి వస్తోన్న అంశాలు నగరంలో కలకలం రేపుతున్నాయి. మొన్నటి మొన్న హైదరాబాద్ శివారు పటాన్‌చెరు కోడి పందేలు వ్యవహారం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ సంఘటన మర్చిపోకముందే, మరో గ్యాంబ్లింగ్ దందా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది.
ఫామ్ హౌస్ పార్టీలు, రేవ్ పార్టీలు, క్యాసినో లాంటివన్నీ నగర శివార్లలో జరుగుతుంటే, పేకాట క్లబ్స్ మాత్రం హైదరాబాద్ నడిబొడ్డునే నిర్వహిస్తున్నారు బిగ్ షాట్స్. బంజారాహిల్స్‌లో పేకాట డెన్ బయటపడింది. పక్కా సమాచారంతో పేకాటస్థావరంపై రెయిడ్ చేసి 10మందిని అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. పట్టుబడిన పేకాటరాయుళ్లంతా బిగ్‌షాట్సే. వీళ్లంతా ఆంధ్రప్రదేశ్ భీమవరంకు చెందిన వ్యాపారవేత్తలని పోలీసులు చెబుతున్నారు. వీళ్లంతా ఓ మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు. 10మంది బిగ్‌షాట్స్‌ను అరెస్ట్ చేసి, వాళ్ల దగ్గర నుంచి సుమారు రూ. 20లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మొన్న కోడి పందేలు, నేడు పేకాట హైదరాబాద్‌లో వెలుగు చూస్తున్న వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ పట్టుబడినవాళ్లంతా వెస్ట్‌గోదావరి ప్రాంతానికి చెందిన వారే కావడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ వారంతా.. కేవలం పేకాట ఆడటానికే హైదరాబాద్ వచ్చారా.? లేక, ఇక్కడే ఉంటూ పేకాట క్లబ్స్ నిర్వహిస్తున్నారా? అన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు ఈ దిశగా విచారణ ప్రారంభించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..