Hyderabad Punjagutta girl murder case: పంజాగుట్ట చిన్నారి హత్య కేసులో మిస్టరీ వీడింది. నాలుగేళ్ల బాలిక హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మహిళతో పాటు మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నిందితులను పోలీసులు కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. బాలికను సొంత తల్లే హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. బెంగుళూరులో బాలికను చంపి కసాయి తల్లి హైదరాబాద్ తీసుకొచ్చి పడేసినట్లు పోలీసులు తెలిపారు. కసాయి తల్లితో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.
ఈ నెల 4న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకపురి కాలనీలో టెన్నిస్ కోర్టు దగ్గరనున్న ఓ షాపు పక్కన గుర్తు తెలియని చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఆ రోజు రాత్రి అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సంఘటన భాగ్యనగరంలో కలకలం రేపింది. దీంతో పంజాగుట్ట పోలీసులు హత్య కేసు నమోదు చేసి.. పలు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. కడుపులో బలంగా తన్నడం వల్లే ఆ బాలిక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ముసుగు ధరించిన మహిళ బాలికను ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు పోలీసులు గుర్తించారు.చిన్నారిని ఎక్కడో చంపేసి నిందితులు ద్వారకాపురి కాలనీలో పడేసినట్లు పోలీసులు ప్రకటించారు. బాలిక మృతదేహాన్ని ఇక్కడ పడేసి నిందితులు వేరే రాష్ట్రానికి వెళ్లినట్లు గుర్తించారు. నిందితుల కోసం నాలుగు పోలీస్ బృందాలతోపాటు, మూడు టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. చివరకు నిందితులను బెంగళూరులో అరెస్టు చేశారు.
Also Read: