శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాళి కట్టిన భార్యను వాహనంతో ఢీ కొట్టి హతమార్చాడు ఓ కసాయి భర్త. కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి వద్ద జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వెంకటాపురం గ్రామానికి చెందిన పూతి రామకృష్ణ కు సారవకోట మండలం, అవలంగి గ్రామానికి చెందిన లలితకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే, ఇటీవల భార్యా భర్తల మద్య స్వల్ప మనస్పర్ధలు వచ్చాయి. దీంతో గత కొంత కాలంగా తలెత్తిన వివాదం.. చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో భర్త వేధింపులు భరించలేక లలిత ఇంటి నుంచి వెళ్లి.. అతనికి దూరంగా ఉంటోంది. కోటబొమ్మాళి మండలం వెంకటాపురం అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తగా విధులు నిర్వహిస్తోంది లలిత. ఈ క్రమంలో తన పిల్లలతో కలిసి నివసిస్తోంది.
ఇదిలావుంటే, గురువారం తల్లిపాల వారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న లలిత.. ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె టూ వీలర్‌ను అనుసరిస్తూ వచ్చిన ఆమె భర్త రామకృష్ణ.. పెద్దబమ్మిడి వద్ద టాటా మ్యాజిక్ వ్యాన్‌తో ఆమె వాహనాన్ని బలంగా ఢీ కొట్టాడు. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. తీవ్రంగా గాయపడ్డ లలితను గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. కాగా, ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేట్టారు. పరారీలో ఉన్న నిందితుడు రామకృష్ణ కోసం కోటబొమ్మాళి పోలీసులు గాలిస్తున్నారు.
Read Also… Dalit Bandhu: తెలంగాణ దళితబంధు అమలుకు కొత్త మార్గదర్శకాలు.. పథకం అమలు తీరు ఎలా ఉంటుందంటే?