మన్‌సుక్ హిరేన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. పోలీసు అధికారి సచిన్ వాజేనే కీలక సూత్రధారి అని తేల్చిన ఏటీఎస్
వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ లభించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

waze prime accused in hiran case: వ్యాపార దిగ్గజం ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ లభించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు నిందితుడిగా భావించిన మన్‌సుక్ హిరేన్ హత్య కేసులో ఇప్పటికే సస్పెండైన సచిన్ వాజేనే కీలక సూత్రధారి అని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్) పేర్కొంది. ఈ కేసులో సచిన్ వాజే కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు లభించినట్లు ఏటీఎస్ చీఫ్ జైజీత్ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న సచిన్ వాజేను తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్‌ఐఏ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ కేసులో సచిన్ వాజే కుట్రకు గల ఉద్దేశాన్ని మాత్రం ఏటీఎస్ అధికారులు వెల్లడించలేదు.
ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ లభించిన కేసుకు సంబంధించి ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆ వాహన యజమానిగా భావిస్తోన్న మన్‌సుక్ హిరేన్ హత్య కేసును మాత్రం ముంబయి ఏటీఎస్ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ వోల్వో కారును సీజ్ చేశామని, ఫోరెన్సిక్ బృందం వాటిని పరీక్షిస్తోందని ఏటీఎస్ అధికారులు పేర్కొన్నారు.
అయితే మన్‌సుక్ హత్యలో సచిన్ వాజే కీలక నిందితుడిగా ఉన్నప్పటికీ, ఘటన జరిగే వేళ ఆయన అక్కడ ఉండకపోవచ్చని, హత్య చేయమని మాత్రం ఆదేశించి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. సచిన్ వాజేను విచారించకుండానే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పొందగలిగామని ఏటీఎస్ అధికారులు చెప్పారు. దర్యాప్తులో భాగంగా సచిన్ వాజేను కస్టడీలోకి తీసుకునేందుకు ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది.
ఇక, ఈ కేసుతో సంబంధముందని భావిస్తోన్న మాజీ కానిస్టేబుల్‌తో పాటు నరేష్ ధారే అలియాస్ నరేష్ గౌర్ అనే బుకీలను రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగానే హిరేన్ హత్యకేసులో సచిన్ వాజే హస్తమున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. వీరే కాకుండా ఈ కేసులో చాలా మంది హస్తం ఉందని, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరుగుతాయని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు.
మరోవైపు, ఈ వ్యవహారానికి సంబంధించి రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. పోలీసుల బదిలీ వెనుక మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పాత్ర ఉందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏకంగా ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేస్తున్నారు.
Read Also… Iindian students: భారతీయ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి నిషేధాన్ని పొడిగించిన చైనా