పేదరికం వారికి శాపమైంది. ఆర్ధిక సమస్యలతో ఇబ్బందులు పడటం మోసగాళ్లకు వరంగా మారింది. మాయమాటలు చెప్పి దుబాయ్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి ఏకంగా వ్యభిచార గృహాలకు అమ్మేసిన దుర్మార్గుల దురాగతాలు మరోసారి వెలుగుచూశాయి.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు దుబాయ్‌లో ఉద్యోగాలు ఉన్నాయని, అక్కడ పనిచేస్తే దాదాపు రూ. 30 వేల జీతం వస్తుందని ఆశపెట్టి తీసుకెళ్లారు. విజిటింగ్ వీసాలపై దుబాయ్ తీసుకెళ్లి వ్యభిచారం చేయాలని బలవంతం చేశారు. ఎంతో నమ్మకంతో దుబాయ్ చేరుకున్న వీరికి అక్కడ ప్రత్యక్ష నరకం కనిపించడంతో ఖంగుతిన్నారు.
వ్యభిచారం చేయాలని తమను బలవంతం చేయడంతో తిరస్కరించిన వీరిని శారీరకంగా చిత్రవధ చేశారు. తెలుగు వారై ఉండి కూడా దుబాయ్ దేశంలో వీరికి ఎన్నో కష్టాలకు గురిచేశారు. దుబాయ్‌లో భాధలను అనుభవించడం కంటే ఇంటికి వెళ్లిపోవడం మంచిదని ఆలోచించి తెగించి వెనక్కి వచ్చేశారు. వచ్చీ రాగానే వీరు దుబాయ్‌లో ఎదుర్కొన్న దారుణ పరిస్థితులపై నరసాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నరసాపురంలో ప్రాంతంలో పలువురు యువతులకు గాలం వేసి గల్ఫ్ దేశాలకు పంపించే నకిలీ ఏజెంట్ చినబాబు, జ్యోతి అనే ఇద్దరు తమను నమ్మించి దుబాయ్‌కి పంపించారని ఆ మహిళలు చెప్పారు. దీంతో చినబాబు,జ్యోతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు . అయితే మోసానికి పాల్పడిన చినబాబు, జ్యోతి అనే ఇద్దరూ ప్రస్తుతం పరారీలో ఉండటంతో వారిని వెదికే పనిలో ఉన్నారు పోలీసులు.