పిల్లల ముందే కొంతమంది తల్లిదండ్రులు విచక్షణ మరిచి ఘర్షణకు దిగుతారు. విపరీతంగా కొట్టుకుంటారు. వీరి గొడవల్ని కళ్లారా చూస్తూ పసిమనసులు ఎలా రోధిస్తాయో, ఎంతగా భయపడతాయో మాత్రం వీరికి అర్ధం కాదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ,నిందించుకుంటూ పిల్లలకు వేదన మిగుల్చుతుంటారు.
ఇలా రోజు ఘర్షణ పడి విడిపోయిన తల్లిదండ్రులను చూసి తీవ్రంగా మనస్థాపం చెందిన ఓ బాలిక (12) ఎలుకలు మందు తిని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగింది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం నాగన్నకుంటకు చెందిన బాలిక.. తల్లిదండ్రులు పడే ఘర్షణతో తీవ్రంగా కలత చెందింది. గత కొంతకాలంగా అమ్మానాన్నలిద్దరూ విడిగా ఉండటం బాలికను మరింత కృంగదీసింది.
ఈ బాధను తట్టుకోలేని బాలిక ఈనెల 28న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తీసుకుంది. దీన్ని గమనించిన స్ధానికులు వెంటనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.