ఫ్రెండ్స్ జతకూడారు. చిరుతను ట్రాప్ చేసి చంపేశారు. దాని మాంసంతో కమ్మటి విందు చేసుకుని లాగించారు. ఆపై.. ఆ చిరుత చర్మాన్ని, గోళ్లను అక్రమ రవాణా చేసి సొమ్ము చేసుకునేందుకు ట్రై చేశారు. అయితే వీరి బాగోతంపై పోలీసులకు ఉప్పు అందింది. రంగంలోకి దిగి.. దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమబెంగాల్‌లోని శిలిగుడిలో ఈ ఘటన వెలుగుచూసింది. అయితే నిందితులను పట్టుకోవడానికి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ బాగా ఉపయోగపడింది. తామేదో ఘనకార్యం వెలగబెట్టినట్లుగా చిరుతను వేటాడిన ఫొటోను నిందితులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ కేసులో నిందితులను గుర్తించేందుకు పోలీసులకు 15 రోజులు పట్టింది. నిందితులు ముకేశ్ కేకెట్టా, పితలుష్ కేర్‌కెట్టాలను అరెస్ట్ చేసి.. వారి నుంచి చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితులకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల వద్ద చిరుత గోళ్లు లభించలేదని.. దీనిపై లోతైన దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.
Also Read: Chicken Rate: చికెన్ సామాన్యుడికి చిక్కనంటుంది.. నెల రోజుల్లోనే డబుల్ అయిన ధర