బెట్టింగ్(Betting).. ఈ మూడక్షరాల పదం చాలు. జీవితాన్ని తలకిందులు చేయడానికి. ఐపీఎల్(IPL) సీజన్ లో బెట్టింగ్ వేయడం సాధారణమైపోయింది. లీగ్ అంతా జరిగేది ఒక ఎత్తైతే.. ఫైనల్ మ్యాచ్ రోజు జరిగే బెట్టింగ్ మరో ఎత్తు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో వేల రూపాయల నుంచి కోట్ల రూపాయలు బెట్టింగ్ వేస్తున్నారు. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్ పై బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బాల్ బాల్ కు బెట్టింగ్ జరుగుతోంది. ఆన్ లైన్ పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ భూతం మరింతగా విజృంభిస్తోంది. ఇలా మ్యాచుపై రకరకాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ఫంటర్స్. ఈ బెట్టింగ్ ఊబిలో ఎక్కువగా యువతే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వందలు, వేలతో మొదలై క్రమంగా లక్షలు, కోట్లకు దారి తీస్తుంది. డబ్బులు వస్తాయన్న ఆశతో ఉన్నదంతా పోగొట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అయితే.. తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలూ చేసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. తాజాగా ఐపీఎల్ -15 వ సీజన్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ నగరంలో జోరుగా బెట్టింగ్ లు సాగాయి.
సైబరాబాద్ పరిధిలో మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో నిమిషాల్లో లక్షల రూపాయలు చేతులు మారాయి.
పక్కా సమాచారంతో మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు బెట్టింగ్ స్థావరాలపై దాడులు చేశారు. బాచుపల్లిలో ముగ్గురు, మియాపూర్ లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుుకన్నారు. హైదరాబాద్ బుకీ లకు కింగ్ పింగ్ గా భీమవరం వర్మ వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి