ED Pulls ESI Scam: జ్యువెలర్స్ షోరూమ్‌లో స్విచ్ వేస్తే.. తెలంగాణ కార్మిక శాఖ పేషీలో లైటు వెలిగింది.. ESI స్కామ్ లో థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్
ESI scam: హైదరాబాద్‌లోని ఓ జ్యువెలర్స్ షోరూమ్‌లో స్విచ్ వేస్తే.. తెలంగాణ కార్మిక శాఖ పేషీలో లైటు వెలిగింది. తెలంగాణ ESI స్కామ్‌లో .. నాయిని అల్లుడి వ్యవహారం బయట పడిన తీరు.. థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్‌లో...
హైదరాబాద్‌లోని ఓ జ్యువెలర్స్ షోరూమ్‌లో స్విచ్ వేస్తే.. తెలంగాణ కార్మిక శాఖ పేషీలో లైటు వెలిగింది. తెలంగాణ ESI స్కామ్‌లో .. నాయిని అల్లుడి వ్యవహారం బయట పడిన తీరు.. థ్రిల్లర్ మూవీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ని మించి పోయింది. జ్యువెలర్స్ షోరూమ్‌కి – ESI స్కామ్‌కి సంబంధం ఏంటో ఓ సారి చూద్దాం..తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ఇప్పటి వరకూ పాత్రధారులే బయటపడితే… కుంభకోణానికి సూత్రదారుల్ని బయటకు లాగుతోంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.
ఏసీబీ దర్యాప్తులో బయటపడని అంశాలు… ఈడీ ఎంక్వైరీలో వెలుగు చూస్తున్నాయి. 2019లో ఈఎస్ఐ స్కామ్ బయటపడ్డాక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 28మందిని ACB అరెస్ట్ చేసింది. ఇప్పుడు ED తనిఖీల్లో.. కార్మిక శాఖ మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డితో పాటు నాయిని వ్యక్తిగత కార్యదర్శి ముకుందరెడ్డి వ్యవహారం బయటికొచ్చింది.
ESI స్కామ్‌లో ఏసీబీ(ACB) దర్యాప్తు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద అధికారుల పాత్రకే పరిమితమైంది. ఈ అక్రమాల్లో శ్రీనివాసరెడ్డితోపాటు కార్మిక శాఖ పేషీలోని అధికారులకు బాగముందనే ఆరోపణలు వచ్చినా.. ఏసీబీ అధికారులకు అధారాలు దొరకలేదు. దేవికారాణి విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు.. విదేశీ పెట్టుబడులపై విచారించాలని ఈడీకి లేఖ రాశారు. ఏసీబీ లేఖతో ఎంట్రీ ఇచ్చిన ఈడీ దుబాయిలో పెట్టుబడుల తీగ లాగడంతో కార్మికశాఖమంత్రి పేషీలో అక్రమాల డొంక కదిలింది.
ఈడీ అధికారులకు అనుమానం రావడానికి ప్రధాన కారణం.. దుబాయిలో పెట్టుబడులతో పాటు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ జ్యువెలర్స్ షోరూంలో బంగారం కొనుగోళ్లు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో దేవికా రాణి నగరంలోని ఓ ప్రముఖ బంగారం దుకాణంలో 4 కోట్ల రూపాయలకు నగలు కొనుగోలు చేసింది. ఆమెతో పాటు శ్రీనివాస రెడ్డి కుటుంబంలో మహిళలు, కార్మిక శాఖ పేషీలో కొంతమంది అధికారుల భార్యలు షాపింగ్‌కు వెళ్లినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బంగారం కొనేందుకు వచ్చిన మహిళల వివరాలు బయటకు తీయడంతో… అక్రమాలకు సహకరించిన అధికారులెవరో తెలిసింది.
7వందల కోట్ల రూపాయల స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి పేరు వినిపించినా… ఆధారాలు సేకరించడంలో ఏసీబీ విఫలమైంది. ఈడీ దర్యాప్తు మొదలైన తర్వాత.. నాయిని కుటుంబ సభ్యులతో పాటు ఆయన పేషీ అధికారులపైనా ఓ కన్నేసింది. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి గతంలో కార్మిక సంఘం నేతగా పనిచేశాడు. దేవికారాణిని విచారించిన ఈడీ అధికారులు శ్రీనివాస్ రెడ్డి గురించి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈ ఇద్దరి నివాసాల్లో సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. 10 రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు.
ESI స్కామ్‌లో ఏసీబీ మూడేళ్లు విచారించినా అదంతా ఈఎస్‌ఐలో ఉద్యోగుల చుట్టూనే తిరిగింది. అయితే ఈడీ రంగంలోకి దిగిన తర్వాత సూత్రధారుల పాత్ర బయటకు వచ్చింది. ఈఎస్‌ఐలో అక్రమార్కులకు కార్మిక శాఖ నుంచి ఎవరెవరు సహకరించారనే కోణంలో ఈడీ ఆధారాలు సేకరించింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ సగం పని పూర్తి చేస్తే.. ఈడీ దానిని కంప్లీట్ చేసే పనిలో ఉంది. ఈ కేసులో త్వరలోనే మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నాయి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు. ఈ కేసులో ఎంత మంది పేర్లు బయట పడుతాయో చూడాలి…