కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలపై ఈడీ నజర్ పెట్టింది. షేర్లు తాకట్టు పెట్టి కార్వీ సంస్థ వెయ్యి కోట్లు సేకరించింది. ఈ నిధులు ఎక్కడికి మళ్లించారనే దానిపై ఇప్పుడు విచారణ చేపట్టింది. కార్వీ ఛైర్మన్ పార్థసారథిని విచారించేందుకు కోర్టు అనుమతిని ఈడీ కోరింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ అక్రమాలపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యవహారంలో సంస్థ ఛైర్మన్ పార్థసారథితో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసింది. స్టాక్‌మార్కెట్ లావాదేవీల నిర్వహణ నెపంతో వినియోగదారుల షేర్లను తనఖా పెట్టిన కార్వీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రుణాలు పొందింది.
ఆ మొత్తం రుణం ప్రస్తుతం రూ.వెయ్యి కోట్లకుపైమాటే అని తెలుస్తోంది. మనీలాండరింగ్ వ్యవహారంపై ప్రస్తుతం దర్యాప్తు చేపట్టిన ఈడీ.. కార్వీ నిర్వాహకులు రూ.వెయ్యి కోట్ల నిధుల్ని ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఫోకస్ పెట్టింది. పార్థసారథిని విచారించేందుకు అనుమతివ్వాలని న్యాయస్థానంను కోరింది. అది లభించాక ఆయన్ని కస్టడీకి తీసుకొని నిధుల మళ్లింపుపై కూపీ లాగనుంది.
కాగా, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంతో కార్వీ సంస్థ ప్రతినిధులు తిరిగి స్టాక్ ట్రేడింగ్‌లోనే పెట్టుబడులు పెట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సంస్థతోపాటు ప్రతినిధుల పేర్లపై ఉన్న ఆస్తులనూ బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందినట్లు గుర్తించారు. పోలీసులకు సుమారు రూ.వెయ్యి కోట్లకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రమే అందగా కార్వీ సంస్థ దాదాపు రూ.2వేల కోట్ల విలువ చేసే షేర్లపై అక్రమ లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్వీ స్టాక్ ట్రేడింగ్ కార్యకలాపాలను ఈడీ నిశితంగా పరిశీలించనుంది.
ఇవి కూడా చదవండి: Cooking Oil: సామాన్యులకు శుభవార్త.. దిగిరానున్న వంట నూనె ధరలు.. ఎప్పటి నుంచి అంటే..!
డుగ్గు డుగ్గు డ్యాన్స్‌తో అదరగొట్టిన టీఆర్‌ఆస్ ఎమ్మెల్యే.. ‘బుల్లెట్ బండి’ రాజయ్య స్టెప్పులు