మద్యం మత్తులో రెచ్చిపోతున్న మందుబాబులు.. పెరుగుతున్న ప్రమాదాలు.. తాగుబోతుల్లో ఎక్కువ శాతం వారే..!
మద్యంబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో మర్చిపోతున్నారు. మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
Alcoholism kills innocents: మద్యంబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో మర్చిపోతున్నారు. మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం తాగి బండి నడపొద్దని పదే పదే చెప్తున్నా.. కొందరికి ఇంకా చెవికెక్కడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. వాళ్ల లైఫ్ రిస్క్‌లో పడ్డమే కాదు..ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. తాగుబోతులు టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరంగా మారుతున్నారు. మాదాపూర్ ఏఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి ఘటన మరువకముందే మరో నిండు ప్రాణం బలైంది.
హైదరాబాద్‌లో తాగుబోతు డ్రైవర్లు మయకింకర్లుగా మారారు. వారం రోజుల వ్యవధిలోనే కిల్లర్ డ్రైవర్స్ ముగ్గురిని ప్రాణాలను బలితీసుకున్నారు. తాజాగా అంబర్‌పేట్‌లో తాగుబోతు డ్రైవర్లు మల్లమ్మ అనే మహిళను ఢీకొట్టారు. ఫుల్‌గా తాగి..జెట్‌స్పీడుతో దూసుకొచ్చిన కారు ..రోడ్డుదాటుతున్న ఓ అమాయకురాలిని పొట్టనబెట్టుకుంది.
కూకటపల్లి నిజాంపేట క్రాస్ రోడ్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా..ఓ కారు దూసుకు వచ్చింది. సృజన్ అనే బిటెక్ స్టూడెంట్ ఫుల్‌గా మందేసి కారులో రోడ్డెక్కాడు. పోలీసులను చూసి ఎస్కేపయ్యే ప్రయత్నంలో పిల్లర్‌ను ఢీకొట్టాడు. అదే టైమ్‌లో ఏఎస్‌ఐ మహిపాల్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఆరా తీస్తున్న క్రమంలోనే క్యాబ్ దూసుకొచ్చి మహిపాల్‌రెడ్డిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మహిపాల్‌ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.చికిత్స పొందుతూ మహిపాల్ కన్నుమూశారు.
మహిపాల్ మరణించిన విషాదాన్నించి తేరుకోకముందే మాదాపూర్‌లో మరో దారుణం జరిగింది. పూటుగా మద్యం తాగి రోడ్డెక్కిన ఓ పోరంబోకు.. స్పీడ్‌కు దూసుకెళ్లి మహిళను ఢీకొట్టాడు. ఈఘటన కవిత అనే మహిళ చనిపోయారు. ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఇలా ప్రతిరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం మద్యం సేవించడం వల్లే జరుగుతున్నాయని పోలీసు లెక్కలే చెబుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎంతగా అవగాహన కల్పిస్తున్నా చాలా మంది ఇంకా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. తాగి వాహనాలు నడిపినవారు ముమ్మాటికీ టెర్రరిస్టులేనని ఇటీవల సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సంచలన కామెంట్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల తాగుబోతులు ఎంతటి భయానకాన్ని సృష్టిస్తున్నారో అద్దంపడుతోంది
జరిమానాలు విధించినా..జైలుకు పంపుతున్నా మందు బాబుల ఆగడాలకు మాత్రం కళ్లెం పడ్డంలేదు. తాగిన మైకంలో యాక్సిడెంట్లు చేయడం..అడ్డుకున్న పోలీసులతో వాగ్వావదానికి దిగడం..దాడులకు సైతం పాల్పడ్డం నిత్యకృత్యాలవుతున్నాయి. తాజాగా మూడు కమిషనేట్ల పరిధిలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కొనసాగాయి. నిన్న ఒక్కరోజే 255 కేసులను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నమోదు చేశారు. జైలుశిక్ష, భారీ జరిమానాలు విధిస్తున్నా తాగుబోతుల్లో మార్పు రావడం లేదు.
హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు శుక్రవారం సాయంత్రం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. కేవలం 12 గంటల్లో 255 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కోసారి వీకెండ్‌లో ఈ సంఖ్య 3 వందల నుంచి ఐదొందల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.
హైటెక్‌సిటీ, ఐటీ ఇండస్ట్రీ ఏరియాలోనే డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా నిన్న గచ్చిబౌలి 51, మాదాపూర్‌లో 46, కూకట్‌పల్లిలో 38 కేసులు నమోదయ్యాయి. ఇక సికింద్రాబాద్ నుండి అల్వాల్ వెళ్లే రూట్‌లో 34 కేసులు, జీడిమెట్ల, 17, మియాపూర్, రాజేంద్రనగర్‌లో 16 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. శంషాబాద్‌లో 15 కేసులు నమోదు చేశారు పోలీసులు. అంటే హైదరాబాద్ నగరశివారు ప్రాంతాల్లోనూ డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వీటిలో మందుబాబులు తాగి…ఎక్కువగా టూవీలర్స్, ఫోర్‌వీలర్స్‌లో వెళ్తూ పట్టుబడ్డారు. తాజాగా 200 టూవీలర్స్, 46 ఫోర్‌వీలర్స్‌పై కేసులు నమోదుచేశారు పోలీసులు.
తాగుబోతుల్లో ఎక్కువ యువతే ఉన్నారు. నిన్న పట్టుబడిన 255 మందిలో 18 25 ఏళ్లలోపు యువకులు 55 మంది ఉన్నారు. ఇక 26 35 ఏళ్లలోపు యువకులు 112 మంది ఉన్నారు. 36 45 ఏళ్లలోపు వారు 13 మంది ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఆ తాగడం కూడా మాములుగా లేదు. పీకలదాకా తాగి డ్రైవ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ 50 99 వరకూ వందమంది పట్టుబడ్డారు. ఇక వంద నుండి 149వరకు 51 మంది దొరికిపోయారు. బ్రీత్ ఎనలైజర్ 300 500 వరకూ ఉన్న తాగుబోతుల సంఖ్య 73 వరకు ఉందని పోలీసులు వెల్లడించారు.
Read Also… పెళ్లి చేయమని ఏకంగా సీఎంనే కలిసాడు.. పోలీసులకు పిల్లను చూడమని చెప్పాడు.. చివరకు ఏమైందంటే..?