Red Fort Violence: ఎర్రకోట హింస కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్. అందులో ఒకరు జనవరి 26న ఎర్రకోట దగ్గర విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడిన ఖేమ్‌ప్రీత్ సింగ్ కాగా, మరొకరు జనవరి 26 నాటి ఘటనతోపాటు అంతకుముందు కూడా నేర చరిత్ర కలిగిన మణిందర్‌జిత్ సింగ్. ఖేమ్ ప్రీత్ సింగ్ పంజాబీ కాగా, మణిందర్‌జిత్ సింగ్ డచ్చి జాతీయుడు.
ప్రస్తుతం బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌లో స్థిరపడ్డ మణిందర్‌జిత్ సింగ్ నకిలీపత్రాలతో దేశం దాటిపోయేందుకు ప్రయత్నించి ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులకు పట్టుబడ్డాడు. గత జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వద్ద హింస చెలరేగినప్పటి నుంచి పోలీసులు ఢిల్లీ, పంజాబ్‌లో నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి వారి జాడ కోసం గాలిస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరితో ఎర్రకోటపై హింస కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 14కు చేరింది. జనవరి 26న ఎర్రకోట దగ్గర పోలీసులపై ఈ ఇద్దరు తల్వార్తతో దాడికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. ఖేమ్‌ప్రీత్‌పై గతంలోనూ అనేక కేసులున్నట్టు పోలీసుల వెల్లడించారు. రిపబ్లిక్‌డే నాడు దేశరాజధాని ఢిల్లీలో ఎర్రకోట దగ్గర చెలరేగిన హింస ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
దీనివెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్రం ఆరోపిస్తోంది. ఎర్రకోట రణతంత్ర పరేడ్‌కు సజీవ సాక్ష్యం. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం రోజున..మన మువ్వన్నెల పతాకం సగర్వంగా ఎగిరే ప్రాంతం. ఇదే ఆ ఎర్రకోట. అదే ఎర్రకోట దగ్గర అరాచక శక్తులు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆందోళనకారులు పెట్రేగిపోవడంతో పోలీసులే ప్రాణభయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది.
పోలీసుల నిబంధనలు పట్టించుకోకుండా వేరే మార్గాల్లో హస్తినలోకి చొచ్చుకొచ్చారు. అంతేకాదు. ఎర్రకోటలోకి చొరబడ్డ ఆందోళనకారులు అరాచకం సృష్టించారు. అద్దాలు పగులగొట్టారు. ఫర్నిచర్‌ను విరగ్గొట్టారు. అయితే హింసకు పాల్పడిన వాళ్లను గుర్తించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.