Murder: ప్రేమ పేరుతో వేధింపులు.. వెంటాడి హత్య.. యువతిని గొడ్డలితో దారుణంగా నరికిన ఉన్మాది
Girl Murder: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. వేధింపులకు గురిచేశాడు.. ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి తండ్రి కూడా ఆ ఉన్మాదిని హెచ్చరించాడు. అయినా
Girl Murder: ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు.. వేధింపులకు గురిచేశాడు.. ఈ విషయం తెలిసి ఆ అమ్మాయి తండ్రి కూడా ఆ ఉన్మాదిని హెచ్చరించాడు. అయినా అతను వినలేదు. చివరకు తనను పట్టించుకోవడంలేదన్న కారణంతో.. ఇంటర్ చదువుతున్న యువతిని ఓ ప్రమోన్మాది గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. ఆరు నెలలపాటు వెంటాడి, వేధించి ఈ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో కలకలం రేపింది. దీంతో ఢిల్లీలోని మోతీబాగ్‌లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని నిందితుడు ప్రవీణ్ ఆరునెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రితో చెప్పింది. దీంతో తండ్రి ప్రవీణ్‌ను కొట్టి.. తీవ్రంగా మందలించాడు. ఇక అప్పటినుంచి ప్రవీణ్ మరింత రెచ్చిపోయాడు. ఎలాగైనా యువతి చంపాలని ప్లాన్ వేశాడు. దీనిలో భాగంగా కొన్నిరోజుల క్రితం ఒక గొడ్డలిని సైతం కొనుగోలు చేశాడు.
ఈ క్రమంలో.. సోమవారం సాయంత్రం షాపునుంచి ఇంటికి వెళుతున్న యువతిపై ప్రవీణ్ గొడ్డలితో దాడి చేశాడు. ముఖంపై తీవ్రగాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొంతపేపటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. యువతి హత్యానంతరం ప్రవీణ్ హర్యానాకు పారిపోయాడు. అనంతరం పల్వాల్‌లో తన సోదరి ఇంట్లో దాక్కున్న ప్రవీణ్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే.. చాలా కాలం నుంచి ప్రవీణ్ వెంటపడుతున్నాడని.. పుట్టినరోజుకు ముందే చంపుతానంటూ బెదిరించి అన్నంత పనిచేశాడని.. మృతురాలి సోదరి విలపించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ఢిల్లీలో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. గత వారం ఒక క్యాబ్ డ్రైవర్, అనుమానంతో ప్రియురాల్ని గొంతుకోసి హత్య చేశాడు. ఇది మరువక ముందే మరో ప్రమోన్మాది దారుణం ఆందోళనకు గురిచేసింది.
Also Read: