Hyderabad Rape Case: హాట్ హాట్‌గా జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఏ1 నిందితుడికి కస్టడీ.. అనుమతిచ్చిన కోర్టు..

రేప్‌ పథకం ప్రకారం వేసుకున్న ప్లానా? అసలు ఎంతమంది పాత్ర ఇందులో ఉంది? ఎవరెవరి సహకారం ఉందనే కోణంలో సాదుద్దీన్‌ను ప్రశ్నించనున్నారు. ఆరుగురు నిందితుల్లో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు ఉన్నారు.

Hyderabad Rape Case: హాట్ హాట్‌గా జూబ్లీహిల్స్ రేప్ కేసు.. ఏ1 నిందితుడికి కస్టడీ.. అనుమతిచ్చిన కోర్టు..
Jubilee Hills Rape Case

Updated on: Jun 08, 2022 | 1:33 PM

బాలిక రేప్ కేసు A-1 నిందితుడు సాదుద్దీన్‌ను గురువారం నుంచి విచారించనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. మూడురోజుల పాటు అత్యాచారానికి సంబంధించిన వివరాలపై ఆరాతీయనున్నారు. రేప్‌ పథకం ప్రకారం వేసుకున్న ప్లానా? అసలు ఎంతమంది పాత్ర ఇందులో ఉంది? ఎవరెవరి సహకారం ఉందనే కోణంలో సాదుద్దీన్‌ను ప్రశ్నించనున్నారు. ఆరుగురు నిందితుల్లో ఒకరు మేజర్, ఐదుగురు మైనర్లు ఉన్నారు. నాంపల్లి కోర్టు మాత్రం మేజర్ అయిన సాదుద్దీన్‌ను మాత్రమే కస్టడీకి అనుమతించింది. అయితే జువైనల్‌ అయినా మేజర్‌గా పరిగణించి శిక్షించే అవకాశం ఉందన్నారు అడ్వకేట్‌ పట్టాభి. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు పోలీసులకు ప్రశ్నాస్త్రాలు సంధించారు. మూడు గంటల్లోనే డీసీపీ దర్యాప్తు ఎలా ముగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే కొడుకే మొదటి ముద్దాయి అంటున్నారు రఘునందన్‌రావు.

రేప్ కేసులో పెద్దల్ని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది తెలంగాణ కాంగ్రెస్‌. బడా బాబులకి ఒక న్యాయం పేదలకి మరో న్యాయమా అని ప్రశ్నించారు ఆ పార్టీ నేత శ్రవణ్‌. జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసు వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్ చుట్టూ తిరుగుతోంది. పొలిటికల్ పార్టీలతో పాటు పాతబస్తీకి చెందిన ముస్లిం మత పెద్దలు కూడా వక్ఫ్‌ బోర్డ్ చైర్మన్‌పై గుస్సా అవుతున్నారు. మహమ్మద్ మసి ఉల్లా ఖాన్‌ పదవి నుంచి దిగిపోవాలని అల్టిమేటమ్ ఇస్తున్నారు. తనయుడు రేప్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడమే ఇందుకు కారణం.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మసీదులు, దర్గాలు వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో పనిచేస్తాయి. వాటికి సంబంధించిన భూములకు కూడా వక్ఫ్ బోర్డ్ చైర్మనే అధిపతి. అలాంటి పదవిలో.. రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొనే వాళ్లు ఆ పదవిలో ఉండటం సరి కాదంటున్నారు మతపెద్దలు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మహమ్మద్ మసి ఉలా ఖాన్.. స్వచ్ఛందంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటున్నారు. ఏదో ఒకటి జరగకపోతే.. వచ్చే శుక్రవారం నుంచి.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

రేప్‌ కేసులో మొదటినుంచి వక్ఫ్‌ బోర్డ్‌ చైర్మన్ తనయుడిపై ఆరోపణలు వస్తున్నా ఆయన మాత్రం స్పందించడం లేదు. ఇక గురువారం సాదుద్దీన్‌ను పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. దీంతో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.