Guntur Church pastors: ఇప్పటివరకూ పాస్టర్ల మధ్య గొడవే అనుకున్నారు. కానీ, ఇప్పుడు పొలిటికల్ లీడర్లు ఎంటర్ అయ్యారు. దీంతో గుంటూరు ఏఈఎల్సీ చర్చి వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుని సరికొత్తగా అక్రమాల కథా చిత్రమ్ తెరపైకి వచ్చింది. చర్చి పాస్టర్లకు చెందిన ఇరువర్గాల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఒక పాస్టర్ జాన్ కృపాకర్‌కు రాజకీయ పరామర్శలు పెరగడంతో పాస్టర్ల గొడవ కాస్త రాజకీయ వివాదంగా మారింది. జాన్ కృపాకర్ ను పరామర్శించిన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి… తెలుగుదేశం టార్గెట్ గా సంచలన కామెంట్స్ చేశారు.
టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అండతోనే ఓ వర్గం దాడులకు దిగుతోందని ఆరోపించారు గౌతమ్ రెడ్డి. అంతేకాదు, గుంటూరు చర్చి వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు, బిషప్ పరదేశి కూడా హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కామెంట్స్ కు కొనసాగింపుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చి ఆస్తులు, నిధులపై కన్నేసిన టీడీపీ నేతలు ఇందులో తలదూర్చారని ఆరోపించారు. కేవలం ఆరోపణలే కాదు.. ఏకంగా చిట్టానే బయటపెట్టారు. రాయపాటి సాంబశివరావు, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తోపాటు పలువురు టీడీపీ నేతలకు అప్పుడు లీజులు కట్టబెట్టారని పరదేశిబాబు చెప్పుకొచ్చారు.
అయితే, ఈ వివాదంలోకి సరికొత్తగా కాంగ్రెస్ సీనియర్ నేత జేడీ శీలం ఎంటరై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా… చర్చి ఆస్తులపై కన్నేస్తుంటారని, ఇప్పుడూ అదే జరుగుతోందని అన్నారు. లీజు పేరుతో చర్చి ఆస్తులను కాజేసేందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని జేడీ అన్నారు. పాస్టర్ల మధ్య రచ్చ కాస్త పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో చర్చి లో జరిగిన అక్రమాలు బయటికి వస్తున్నాయి. లీజుల్లో లొసుగులు, నిధుల గోల్ మాల్ పై ఒక్కొక్కరు నోరు విప్పుతున్నారు.
బిషప్ పరదేశీబాబు.. టీడీపీ నేతల పేర్లు బయట పెట్టడంతో.. ముందుముందు ఇంకెన్ని పేర్లు బయటికి వస్తాయోనన్నది హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఫాదర్ల పంచాయితీ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో లీజు చాటు అక్రమాల కథా చిత్రమ్ తెరపైకి వస్తోంది. మరి, ఈ వివాదంలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మాత్రం.. గుంటూరు జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలు ఖాయంగా కనిపిస్తున్నాయి.