Chigurupati Jayaram: చిగురుపాటి జయరాం హత్య కేసు.. గవర్నమెంట్ పీపీకి బెదిరింపులు
Chigurupati Jayaram: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో సంచలనం. నిందితుడు రాకేశ్ రెడ్డి అనుచరులు
Chigurupati Jayaram: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో మరో సంచలనం. నిందితుడు రాకేశ్ రెడ్డి అనుచరులు గవర్నమెంట్ పీపీని బెదిరించారు. కేసు విషయంలో తమకు అనుకూలంగా ఉండాలని అక్బర్ అలీ, మంగయ్య గుప్త, కత్తుల శ్రీనివాస్ పబ్లిక్ ప్రాసిక్యూకర్‌ని బెదిరించారు. ఈ వ్యవహారం మొత్తం రాకేశ్‌రెడ్డి జైలు నుంచి నడిపారని తెలుస్తోంది. పీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్ రెడ్డి అనుచరులైన అక్బర్ అలీ, గిప్త, శ్రీనివాస్ లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.
2019లో చిగురుపాటి జయరాంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రాకేశ్ రెడ్డి తన నివాసానికి రప్పించి హత్య చేసిన సంగతి తెలిసిందే. జయరాం మృతదేహాన్ని కారులోకి ఎక్కించి.. తన స్నేహితుడైన నల్లకుంట ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులును కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో అతడు అందుబాటులో లేకపోవడంతో ఇబ్రహీంపట్నం ఏసీపీగా వున్న మల్లారెడ్డిని రాకేశ్ సంప్రదించాడు. ఈ ఇద్దరు పోలీసు అధికార్ల సూచనతో హత్యను డ్రంక్ అండ్ డ్రైవ్‌గా చిత్రీకరించేందుకు ప్రయత్నంచారు.
కారుతో సహా మృతదేహాన్ని ఏపీలోని నందిగామలో వదిలేసి తిరిగొచ్చేశారు. ఇదిలా ఉండగా జయరాంను రాకేష్ చిత్ర హింసలు చేసే సమయంలో అక్కడే ఉన్న నిందితులు 11 వీడియోలు, 13 ఫొటోలను తీశారు. వీటన్నింటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా కోర్టుకు సమర్పించిన ఛార్జీషీటులో రాకేష్ రెడ్డిని మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. అయితే ఈ కేసు విషయంలో ఇప్పుడు నిందితులు ఎలాగైనా తప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే సాక్ష్యులను బెదిరించడం, పీపీని బెదిరించడం వంటివి చేస్తున్నారని జయరాం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.