బ్యాంకు రుణాలు పేరుతో మోసం… డబ్బులేవని నిలదీస్తే బెదిరింపులు… కేసులు పెడతామంటే ఆత్మహత్యా యత్నం… కామారెడ్డిలో జరిగిన ఈ సంఘటన సంచలనమవుతోంది. తమ డబ్బులు సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గృహ రుణాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకుని మోసం చేసిన ఓ ఘరానా మోసగాడి భాగోతం కామారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. లింగంపేటకు చెందిన మన్నే రాజు… ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగినంటూ ఈ మోసాలకు పాల్పడ్డాడు. ఇంటి రుణాలు ఇప్పిస్తానని బిబిపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రేగుల సంతోష్ సహా మరో నలుగురి వద్ద కమీషన్లు కొట్టేశాడు. మొత్తం లక్షా 11వేల రూపాయల నగదు… ఇంటి కాగితాలు తీసుకొని ఉడాయించాడు. రోజులు గడుస్తున్నా రుణం ఇవ్వకపోగా తప్పంచుకొని తిరిగాడు. గట్టిగా నిలదీస్తే డెడ్‌లైన్లు పెడుతూ వచ్చాడు. ఓ రోజు రాజు ఇంటికి వెళ్లిన బాధితులు… జరిగిన మోసాన్ని ఆయన భార్యకు చెబితే ఆమె రెండు మూడు రోజులు అంటూ దాటవేశారు. మళ్లీ వెళ్తే కొద్ది రోజుల్లో అమౌంట్ సెట్ చేస్తానని మాట ఇచ్చి… 100 రూపాయల స్టాంప్ పేపర్‌పై రాసిచ్చారు. తర్వాత ఆ స్టాంప్ పేపర్ తీసుకెళ్లి డబ్బులు ఏవని నిలదీస్తే… తమకు ఎలాంటి సంబంధం లేదని… అసలు డబ్బులే తీసుకోలేదని బుకాయించారు. ఏం చేసుకుంటారో చేసుకోండని చీత్కరించుకున్నారు. గట్టిగా అడిగితే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఏం చేయాలో తెలియక కామారెడ్డి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ కంప్లైంట్ సంగతి తెలుసుకొని ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు రాజు భార్య. వెంటనే ఆమెను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స చేయించారు స్థానికులు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం లేదని తేల్చారు వైద్యులు. రావాల్సిన డబ్బులు అడిగితే ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు బాధితులు. బ్యాంక్ రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని… తమ అమౌంట్ తమకు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇచ్చిన డబ్బులు అడిగితే ఆత్మహత్య చేసుకొని బెదిరింపులకు దిగడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
Also Read: కామారెడ్డి జిల్లాలో మడ్ బాత్… పుట్టమన్ను దంచి, జల్లెడ పట్టి.. గులాబీ రేకులు, గోమూత్రం, గోపేడ కలిపి